విమాన ప్రయాణం చేసేవారు..అంటే..ఉన్నత విద్యనైనా అభ్యసించి ఉండాలి. లేకపోతే.. ఉన్నతస్థాయిలో అయినా ఉండాలి. ఇవన్నీ లేకపోతే.. సమాజంలో ఆర్థికంగా బలంగా అయినా ఉండాలి. అలాంటి వారికి సంస్కారం ఉంటుందని ఆశిస్తాం. అయితే.. ఒక ప్రయాణికుడు మాత్రం పుల్లుగా మందు కొట్టి సంస్కారం మరిచిపోయి.. వ్యవహరించాడు. తోటి ప్రయాణికురాలిపై ఉచ్చ పోశాడు.
మద్యం మత్తులో ఉండి, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఎయిరిండియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంఘటన నవంబరు 26న జరిగినట్లు ఎయిరిండియా అధికారిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది.
న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన విమానంలో ఈ దారుణం జరిగింది. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై పోలీసులకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఆయనను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టాలని సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వ కమిటీ నిర్ణయం తీసుకోవలసి ఉంది.
ఏం జరిగింది?
గతేడాది నవంబర్ 26న అమెరికాలోని సంపన్న పట్టణం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం.. ఢిల్లీకి బయల్దేరింది. మార్గమధ్యలో బిజినెస్ క్లాస్ సీట్లో కూర్చున్న 70ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. దీనిపై ఆ వృద్ధురాలు విమాన సంస్థకు లేఖ రాయడంతో విషయం వెలుగు చూసింది.
“ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. డీజీసీఏకు వివరాలు సమర్పించాం. విచారణ సమయంలో బాధిత ప్రయాణికురాలు, ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపాం” అని ఎయిర్ఇండియా ప్రతినిధి తెలిపారు. నిందితుడిపై నియంత్రణ సంస్థతో పాటు పోలీసులు సైతం తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.