జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదిగో అదిగో అనుకుంటూనే నెలలకు నెలలు గడిచిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఒక దశలో ఆగిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి తెరదించుతూ ఆ మధ్య చిత్ర బృందం కొంచెం హడావుడి చేసింది. ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నట్లు సంకేతాలు ఇస్తూ దర్శకుడు కొరటాల శివ.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో చర్చిస్తున్న ఫొటోలు కూడా రిలీజ్ చేశారు.
కాబట్టి సినిమా విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేనట్లే. కాకపోతే సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో తెలియని అయోమయంలో అభిమానులు ఉన్నారు. తారక్ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడం, దాదాపు నెల రోజులు అందుబాటులో ఉండడని వార్తలు రావడంతో జనవరిలో కూడా సినిమా మొదలువుతుందా లేదా అన్న చర్చ నడుస్తోంది.
ఐతే షూటింగ్ సంగతేమో కానీ.. ఈ సినిమా విడుదల తేదీ మాత్రం ఖరారైపోయింది. 2024 ఏప్రిల్ 5న ఉగాది కానుకగా ‘ఎన్టీఆర్ 30’ విడుదల కానుందట. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైతే అయింది కానీ.. షూటింగ్ మొదలయ్యాక వేగంగా పని పూర్తి చేసి 2023లోనే సినిమాను రిలీజ్ చేస్తారేమో అని ఆశించారు అభిమానులు.
కానీ, ఏకంగా 2024 వేసవికి వెళ్లిపోయిందీ సినిమా. అంటే ‘ఆర్ఆర్ఆర్’ కోసం నాలుగేళ్లు ఎదురు చూసిన ఫ్యాన్స్..తమ హీరో కొత్త చిత్రం కోసం ఇంకో రెండేళ్లు వెయిటగ్ చేయాల్సిందే అన్నమాట. యువసుధ ఆర్ట్స్ బేనర్ అధినేత అయిన కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అభిమానులు కోరుకున్నట్లే తమిళ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. సాబుసిరిల్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపడుతున్నాడు.