ఔను! ఆయన ఎక్కడున్నా.. పొగేనట! ఆయన ఏ పార్టీలో ఉన్నా.. స్వపక్షంలో విపక్షమేనట! ఇదీ.. ఇప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ అన్నా రాంబాబు గురించి పెద్ద ఎత్తున వైసీపీలో జరుగుతున్న చర్చ. గతంలో టీడీపీలో ఉన్నప్పుడుకూడా ఆయన రచ్చ రచ్చ చేశారు. ఏకంగా చంద్రబాబుకే సవాల్ రువ్వి.. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు కూడా ఇదే పంథాలో ఆయన కొనసాగుతున్నారు.
తాజాగా ఆయన తన సొంత పార్టీనేతలపై రోడ్డెక్కి.. కామెంట్లు చేశారు. సొంత పార్టీ నేతలే పనిగట్టుకుని తనపై విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారికి త్వరలోనే తగిన గుణపాఠం నేర్పుతానని ఎదురుదాడి చేశారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో జరిగిన వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహించే సమస్య లేదని మండిపడ్డారు.
నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొందరు పనిగట్టుకుని(నువ్వు సరిగ్గా ఉంటే మాకేం పని అనివారు అంటున్నారు) తనతో పాటుగా తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉండి పని చేయించుకున్న వాళ్లే తన వెనకాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబం మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాంటి ఆరోపణలు చేసే వారందరికీ ఒక్కటే హెచ్చరిక అంటూ… తనను కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా విమర్శిస్తే అలాటి వారికి తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. కావాలంటే చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. తాను ఏ రోజూ అవినీతికి పాల్పడలేదనీ.. ఎవరికి అన్యాయం చేయలేదని తెలిపారు.(ఈ విషయం టీడీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే పార్టీ నుంచి గెంటేశారని.. వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు)
తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ.. అన్నా రాంబాబు ఆవేశంతో ఊగిపోయారు. పార్టీకి గానీ కార్యకర్తలను గానీ అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే పెద్దలవద్ద కూర్చొని మాట్లాడుకోవాలని తెలిపారు.(మరి ఈ పనిమీరెందుకు చేయడంలేదు. రోడ్డెందుకు ఎక్కారు అనేది వైసీపీ నేతల మరో ప్రశ్న) వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహించే సమస్య లేదని మండిపడ్డారు.(టీడీపీ పెంచి పోషించిన విషయాన్ని మరిచిపోయి.. ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేస్తానని అనడం వెన్నుపోటు కాదా? అని తటస్థ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు). ఇదీ.. అన్నా గారి రాజకీయం!!