400 రోజులు ఏకధాటిగా సాగేలా నారా లోకేశ్ పాదయాత్ర ప్రణాళిక ప్రతి నియోజకవర్గంలో 3 లేదా 4 రోజులు సాగేలా కార్యాచరణ ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా రూపకల్పన ఎక్కువ భాగం గ్రామాల్లో కొనసాగేలా నారా లోకేశ్ పాదయాత్ర 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర సాగేలా ప్రణాళికలు.
ప్రతిపక్ష టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్‌ను దాదాపు ఖరారు అయ్యింది. జనవరి 26న చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు.
1989 నుంచి తన తండ్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం గత ఏడు ఎన్నికల్లో ఓడిపోలేదు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పుడు దీనిపై దృష్టి సారించి, వచ్చే ఎన్నికల్లో సీటును కైవసం చేసుకునేందుకు కృషి చేయడంతో బాబు దానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఇక తాను జనంలో మరింతగా దగ్గరవడానికి పాదయాత్రను లోకేష్ ఒక మార్గంగా ఎంచుకున్నారు. నిరుద్యోగం, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలను యువతకు చేరవేయాలనే లక్ష్యంతో లోకేష్ పాదయాత్రకు టీడీపీ ’యువ గళం’ అని పేరు పెట్టింది.
లోకేశ్ పాదయాత్ర ఏడాదికి పైగా సాగనుంది. పాదయాత్రను ఎవరు చేపడతారనే దానిపై కూడా చర్చలు జరిగాయి. ఒకానొక సమయంలో చంద్రబాబు నాయుడు మరిన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు బస్సు యాత్రను ప్లాన్ చేశారు. అయితే ఎట్టకేలకు లోకేష్ పాదయాత్ర చేపట్టాలని పార్టీ పొలిట్ బ్యూరో అంగీకరించింది.
టీడీపీకి చెందిన ఎన్నారై, ఐటీ బృందాలు గత మూడు నెలలుగా దీనిపై కసరత్తు చేస్తుండగా, ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు క్లియర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చిత్తూరులోని కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజుల పాటు పాదయాత్ర జరగనుంది.
గతంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమార్తె వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలకు ఇచ్ఛాపురం గమ్యస్థానంగా ఉండేది. ఈ మార్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు.
మరో వారం రోజుల్లో రూట్ మ్యాప్ విడుదలయ్యే అవకాశం ఉంది. లోకేశ్ విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సిన బందోబస్తుతో పాటు పాదయాత్రకు అవసరమైన బందోబస్తును సమకూర్చే పనిలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది.