ఇప్పటి వరకు కాంగ్రెస్కు సుద్దులు చెప్పిన బీజేపీ..తన దాకా వస్తే మాత్రం అన్నీ యూటర్న్ రాజకీయాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం కోరనా వచ్చేసిందని.. కాబట్టి.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేస్తున్న పాదయాత్రను వాయిదా వేసుకోవాలని చెప్పిన బీజేపీ పెద్దలు.. ఇప్పుడు అదే పాదయాత్రకు తాము రెడీ అవుతూ.. కొత్త సుద్దులు చెబుతున్నారు. తాము కరోనా నిబంధనలు పాటిస్తామని అంటున్నారు.
రాజస్థాన్లో ‘జన్ ఆక్రోశ్ యాత్రసపై బీజేపీ తీసుకున్న ఈ యూటర్న్ విమర్శలకు తావిస్తోంది. చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు ముందు ప్రకటించింది. అయితే గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. కొవిడ్ నిబంధనలను అనుసరించి యాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు బీజేపీ జాతీయ నేత నడ్డా చెప్పారు.
రాజస్థాన్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిసెంబరు 1న జన్ ఆక్రోశ్ యాత్రను ప్రారంభించారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సభలు నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ యాత్రను రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీకి ప్రజలే ముఖ్యం అంటూ.. కాంగ్రెస్కు చురకలు కూడా అంటించింది.
అయితే.. ఇంతలోనే ఏమైందో ఏమో యాత్రను రద్దు చేయట్లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు చేసింది. కరోనా కేసులు పెరిగే అవకాశముందని యాత్రను ఆపేయాలని బీజేపీ నేతలు చెప్పారు. కానీ, తాము మాత్రం కొనసాగిస్తున్నట్టు పేర్కొనడం రాజకీయంగా వివాదానికి దారితీసింది.