మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా సహాయంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ అనే బినామీలు సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఆ కంపెనీ దాదాపు రూ.1100 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిందని టీడీపీ నేత పట్టాభి కొద్ది రోజుల క్రితం ఆరోపించారు.
రూ. 20 వేలు కడితే 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని నమ్మబలికి జనాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వంశీ 3 నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సంకల్ప సిద్ధి సంస్థ డైరెక్టర్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్న విజయవాడ పోలీసులు సంస్థ ఎండీ వేణుగోపాల్, డైరెక్టర్ కిశోర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను వారం పాటు కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
అయితే, సంకల్ప సిద్ధి వ్యవహారంలో తనపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర డీజీపీకి వంశీ ఫిర్యాదు చేశారు. ఆ స్కాంలో తనకు, కొడాలి నానికి ఓలుపల్లి రంగా ద్వారా పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాసినో వ్యవహారంలోనూ ఇదే తరహాలో అవాస్తవ ఆరోపణలు చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వంశీపై పట్టాభి విమర్శలు గుప్పించారు.
వల్లభనేని వంశీ డ్రామాలు ఆడుతున్నాడని, డీజీపీకి ఫిర్యాదు చేస్తే నిజాలు దాగవని అన్నారు. గోడలు దూకి, పార్టీలు ఫిరాయించే వంశీని ప్రజలు ముద్దుగా ‘జంపింగ్ జపాంగ్’ అని పిలుస్తున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. వంశీకి దమ్ముంటే ఆయన అనుచరులను పోలీసులకు అప్పగించాలని, వారి కాల్ డేటా బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. సంకల్ప సిద్ధి స్కాంలో సీబీఐ విచారణ కోరే దమ్ము వంశీకి ఉందా అని పట్టాభి నిలదీశారు.