వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించడం లేదని, కఠిన శిక్షలు విధించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం వ్యవహారం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యవహారాన్ని ప్రభుత్వం ఏదోలా సద్దుమణిగేలా చేసింది. అయితే, తాజాగా విశాఖపట్టణం ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఆటో రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉన్న ఘటన వివాదానికి కేంద్రబిందువుగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉండడం కలకలం రేపింది. పోలీసులు తమకు జారీ చేసిన రసీదులను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
దీంతో, ఈ తరహాలో కొందరు పోలీసులు మత ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ట్రాఫిక్ పోలీసులపై పలు హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం దుమారం రేపడంతో పోలీసులు వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. తమ వద్ద రసీదులు అయిపోయాయని, దీంతో, రెగ్యులర్ గా రసీదు పుస్తకాలు ముద్రించే వ్యక్తి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు.
కానీ, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూసిన వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు. గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు పబ్లిసిటీ కోసం ఆ రసీదులు సరఫరా చేసేవి. దీంతో, ఆ రసీదులపై సదరు కంపెనీ పేరుండేది. కానీ, ఇప్పుడు జారీ చేసిన రసీదులపై ఆయా సంస్థల పేర్లు లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది.