రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. “ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి“ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు తాజాగా ప్రారంభించారు.
50 రోజుల్లో రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమంలో భాగంగా కలవాలని నిర్దేశించారు. డిసెంబరు 1న దీనిని క్షేత్ర స్థాయిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని టీడీపీ తలపెట్టింది.
దీనిలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో వీలైనన్ని కుటుంబాల వద్దకు వెళ్లి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇస్తారు. కొన్ని సమస్యలను పార్టీ బృంచాలు తామే ప్రస్తావించి రాష్ట్రంలో పరిస్థితులను వివరించి మనందరికీ “ఏమిటీ ఖర్మ“ అని వివరించాలని నిర్ణయించారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాలు మృగ్యమై రాష్ట్రంలో నిరు ద్యోగు తాండవించడం, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వివరీతంగా పెరిగిపోయి శాంతిభద్రతలు క్షీణిస్తున్న తీరు, ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరం కావడం వంటి కీలక విషయాలను ప్రస్తావిస్తారు.
అదేవిధంగా.. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోవడానికి తోడు గంజాయి వంటి మత్తు పదార్థాలు విశృంఖలంగా వ్యాపించి యువత, పిల్లలు వ్యసనపరులు అవుతుండటం, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారు కావడం, ఇనుక రేటు నాలుగు వందల శాతం పెరిగిపోయి ఇసుక మాఫియా కొల్లగొట్టడం, రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, నిధుల లూటీని ప్రశ్నించిన వారిపై పోలీసులను ప్రయోగించడం, పోలీసులతో గొంతు నొక్కించడం, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం, గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి అద్వాన్నం కావడం వంటి అంశాలను టీడీపీ బృందాలు ప్రజల వద్ద ప్రస్తావించనున్నాయి.
ఇవికాక ప్రజలు తమకు తాముగా మరేవైనా సమస్యలు ప్రస్తావిస్తే వాటిని కూడా ఈ బృందాలు నమోదు చేసుకొంటాయి. జగన్ ప్రభుత్వంలో తమను బాధించే అంశాలేమిటి అన్నదానిపై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాయి.
రాష్ట్రంలో అన్నిచోట్ల నుంచి ఈ సమాచారం వచ్చిన తర్వాత దానిని క్రోడీకరించి గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతుల్లో ఎవరికైనా ఒకరికి పంపిస్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రతి కుటుంబం “ఏమిటి ఖర్మ“ అనుకొనే దుస్థితి దాపురించిందని, ఈ దుస్థితికి వైసీపీ ప్రభుత్వ అసమర్థ అవినీతి అరాచక పాలనే కారణమని ప్రజలు గుర్తించేలా చేయడానికి దీనిని చేపట్టారు.
పార్టీ తరఫున మొత్తం 8 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 50 లక్షల కుటుంబాలను కలిసి మాట్లాడాలన్నది లక్ష్యగా పెట్టుకున్నారు. అన్ని వనరులు ఉన్నా రాష్ట్ర వెనుకబడిపోయిందని, ప్రతి వర్గం అసహనంతో ఉందని, ఎవరినీ వదిలిపెట్టకుండా పిండుతున్నారని… సామాన్యులను కూడా బాదుతున్నారని, తమను రసగుల్లాల మాదిరిగా నమిలేను న్నారని వ్యాపారులు బాధపడుతున్నారని.. వంటి కీలక విషయాలను ప్రస్తావిస్తారు.
దుర్మార్గ పాలనలో రాష్ట్రానికి "ఇదేం ఖర్మ" .. pic.twitter.com/34ha8Mmavc
— iTDP Official (@iTDP_Official) November 19, 2022
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వయంగా 25 నియోజకవర్గాల్లో పర్యటించి `ఇదేం ఖర్మ` కార్యక్రమంలో పాల్గొంటారు. పనిలో పనిగా ఈ కార్యక్రమంలో పార్టీ నేతల పనితీరును కూడా నిశితంగా పరిశీలిస్తారు. నాయకుల సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఇదొక కొలబద్దగా భావించనున్నారు.
ప్రజల్లోకి వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతి, దౌర్జన్యాలు, తప్పిదాలపై కూడా టీడీపీ నేతలు ఖచ్చితంగా ప్రశ్నించాలని నిర్ణయించారు. వారిపై పోరాడకపోతే ప్రజల్లో విశ్వాసం రాదని, ప్రజల్లో విశ్వాసం పొందలేనివారికి టికెట్లు ఇచ్చినా గెలవలేరని చంద్రబాబు భావిస్తున్నారు.
“అధికార పార్టీ నేతలు వలంటీర్లపై అధికంగా ఆధారపడుతున్నారు. మనం ప్రతి ఇంటితో సుబంధ బాంధవ్యాలు పెట్టుకొని తరచూ పలకరిస్తూ ఉంటే వలంటీర్ల ప్రభావం తగ్గించగలుగుతాం. ఈ కార్యక్రమంలో మనకు అందే సమాచారం మన ఎజెండాను ఖరారు చేసుకోవడానికి.. రేపు మేనిఫెస్టోను రూపొందించుకోవడానికి కూడా పనికివస్తుంది’ అని చంద్రబాబు వివరించారు. ఈ కార్య క్రమం కోసం ఒక ఫోన్ నంబర్ కూడా కేటాయించారు. 13612 32612 అనే ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ బృందాలు సంప్రదిస్తాయి.