ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ, తెలంగాణలో రెండ్రోజులు పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ రోజ సాయంత్రం 7.25 నిమిషాలకు విశాఖ చేరుకున్న మోదీ మరుసటిరోజు మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉండబోతున్నారు. ఈ సందర్భంగా మోడీ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
శుక్రవారం రాత్రి 7. 25 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో నేవీ అతిథిగృహం ఐఎన్ఎస్ చోళాకు బయలుదేరుతారు. ఈ సందర్భంగా 7.30 నుంచి 7.45 వరకూ కిలోమీటర్ మేర జరిగే రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు చోళా గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 8.00 నుంచి 8.30 వరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
ఆ తర్వాత 8.30 నుంచి 8.40 అంటే 10 నిమిషాల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మోడీ భేటీ కాబోతున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విశాఖ టూర్ లో తన అనుభవాలు, భవిష్యత్ కార్యచరణపై వీరిద్దరూ చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఇక, పవన్ తో భేటీ అనంతరం రాత్రి 8. 40 నుంచి పీఎం షెడ్యూల్ రిజర్వ్ కానుంది. ఆ గెస్ట్ హౌస్ లోనే మోడీ రాత్రి బస చేసి విశ్రాంతి తీసుకోబోతున్నారు.
ఆ తర్వాత నవంబర్ 12న శనివారం ఉదయం 9 గంటల నుంచి వీఐపీ అపాయింట్మెంట్స్ మొదలు కానున్నాయి. ఆ తర్వాత మోడీ హెలికాఫ్టర్ ద్వారా 10.10కు ఆంధ్రా యూనివర్సిటీకి బయలుదేరుతారు. 10.25 కల్లా ఏయూకు చేరుకుంటారు. 10.30 దగ్గరకు వేదిక దగ్గరకు చేరుకుంటారు. వేదికపై నుంచి వర్చువల్ గా 9 ప్రాజెక్టులకు శంఖుస్థాపన, రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తారు. 11.30 నుంచి 11.45 వరకు ప్రధాని ప్రసంగం ఉంటుంది.
11.45కు ఎయిర్ పోర్టుకు బయలు దేరిన మోడీ…12కల్లా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 12.05 నిమిషాలకు ప్రధాని మోడీ ప్రయాణించే ప్రత్యేక విమానం బయలుదేరనుంది. మధ్యాహ్నం 1.10 నిమిషాలకు హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో మోడీ ల్యాండవుతారు. ఆ తర్వాత రామగుండం వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో దాదాపు 7వేల మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్లు ఏర్పాటు చేశారు.