ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్, రైతుల పిటిషన్లపై విచారణ జరిపేందుకు ఆయన విముఖత చూపారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి ఈ పిటిషన్లను పంపాలని సుప్రీం రిజిస్ట్రీని ఆదేశించారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
2వేల పేజీల తీర్పును నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది. ఆ తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని ఆరోపించింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అయితే, అమరావతి రాజధానిపై రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. ఈ క్రమంలోనే సీజేఐ ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ కేసు విచారణ నుంచి వైదొలిగారు. దీంతో, ఈ పిటిషన్లపై విచారణకు కొత్త బెంచ్ ఏర్పాటు కానుంది. గతంలో న్యాయవాదిగా ఉన్న సమయంలో సీఎం జగన్ కేసులను ప్రస్తుత సీజేఐ యు.యు.లలిత్ వాదించారు. ఈ క్రమంలోనే రాజధాని పిటిషన్ల విచారణ నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది.