ఏపీలో సీఎం జగన్ ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పాలనలో జనంపై బాదుడే బాదుడు అంటూ టిడిపి గతంలోనే నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ పై టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. విద్యుత్ చార్జీలను జగన్ భారీగా పెంచారని, చంద్రబాబు పాలనలో ఎటువంటి చార్జీల భారం ప్రజలపై లేదని అన్నారు.
ప్రజలపై భారం మోపే విషయంలో జగన్ రెడ్డి రివర్స్ లో వెళ్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్య కాలానికి కూడా ఇప్పుడు ట్రూ ఆప్ చార్జీలు వసూలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని, చంద్రబాబు పాలనలో ప్రజలపై పైసా భారం పడలేదని పట్టాభి ఆరోపించారు. ఇదే మాదిరిగా రివర్స్ లో వెళ్లి టిడిపి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను జగన్ కొనసాగించగలరా అని పట్టాభి నిలదీశారు.
బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని, దాన్ని పూడ్చుకోవడానికి మార్కెట్లో ఎక్కువ రేటుపెట్టి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అదే చంద్రబాబు అయితే ముందుచూపుతో బొగ్గు కోసం ఏపీఎండీసీ ద్వారా మధ్యప్రదేశ్ లోని సులియారి కోల్ మైన్ తీసుకున్నారని గుర్తు చేశారు. కానీ, అదే కోల్ మైన్ ను ఈరోజు ఆదానీలకు జగన్ కట్టబెట్టారని పట్టాభి ఆరోపించారు.
ఏపీ జెన్కోకు ఆ బొగ్గు గని ఇచ్చి ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరతే ఉండేది కాదని పట్టాభి స్పష్టం చేశారు. ఇక, జగన్ అసమర్థత వల్లే కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. తన స్వలాభం కోసం జగన్ రెడ్డి అధానీలతో లాలూచీపడి ఈ విధంగా ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని, ఈ వాస్తవాలను ప్రజలు గ్రహించాలని అన్నారు.