ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఏపీ సీఎం జగన్ తో పాటు దేశంలోని ఎందరినో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేలా చేయడంలో పీకేది కీలక పాత్ర. పీకే స్కెచ్ వేస్తే ఆ రాష్ట్రంలో అధికారం ఆయన మద్దతిచ్చిన పార్టీకి దక్కుతుందని గట్టిగురి. అయితే ఇటీవల బీజేపీతో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ తో విభజించిన పీకే జన్ స్వరాజ్ ఉద్యమానికి తెరతీశారు.
అయితే, ఆ ఉద్యమానికి బిజెపి మద్దతిస్తోందని, పీకేకు బిజెపి ఆర్థిక సాయం చేస్తోందని జెడియు అధ్యక్షుడు రాజీవ్ రంజాన్ సింగ్ ఆరోపణల పై పీకే స్పందించారు. గతంలో పీకేపై బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే తరహాలో సంచలన ఆరోపణలు గుప్పించడంతో పీకే ఈ సారి ఘాటుగా స్పందించారు. తాను బిజెపి డబ్బులు తీసుకోవడం లేదని, తనకు బిజెపి ఆర్థిక సాయం చేయడం లేదని పీకే అన్నారు. అంతేకాదు, తనకు ఆరుగురు ముఖ్యమంత్రులు ఆర్థిక సాయం చేస్తున్నారని పీకే వెల్లడించారు.
గతంలో ఐప్యాక్ ద్వారా సేవలు పొంది పదవులు అధిష్టించిన వారు ఇప్పుడు తనకు అండగా ఉంటున్నారని పీకే వెల్లడించారు. అలా చేస్తున్న వారిలో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని, ఇంకా చాలామంది రాజకీయ నేతలు ఉన్నారని చెప్పారు. దేశంలోని రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు బీహార్లో దాదాపు 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేందుకు పీకే సంకల్పించారు. ఈ క్రమంలోనే నేపాల్ సరిహద్దులోని వాల్మీకి నగర్ కు ఈ పాదయాత్ర చేరుకుంది.