ఏపీ బీజేపీ నేతలతో తనకు సెట్ కావడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి హుటాహుటిన పిలుపు కూడా వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని సోమునుద్దేశించి కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. మిత్రపక్షం జనసేనను సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా దుయ్యబట్టారు. తన మనసులో మాటను పవన్ బయటపెట్టారని చెప్పారు. రాష్ట్ర వ్యవహారాలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరముందని కన్నా అన్నారు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను అధ్యక్షుడిగా ఉన్నపుడు 2 నెలలకోసారి కోర్ కమిటీ భేటీ జరిగేదని, ఆ సమావేశంలో సమస్యలు, అంశాలపై చర్చించేవారమని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, కోర్ కమిటీ సమావేశాల ఊసే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలకే ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో తెలియని స్థితికి పార్టీ వచ్చిందని అన్నారు. జనసేనతో పార్టీ కీలక నేత మురళీధరన్ సమన్వయం చేస్తారని తెలిసినా ఆ దిశగా అడుగులు పడలేదని కన్నా అన్నారు. అయితే, కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, అందుకే, ఆయన సోముపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది.