ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి అంటూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమరావతి టు అరసవెల్లి పేరుతో చేపట్టిన ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం, వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే, దానిని అడ్డుకుంటామని ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు బాహాటంగానే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
అయితే, అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైసీపీ నేతల పాచికలు పారడం లేదు. ఈ క్రమంలోనే ఎలాగోలా పాదయాత్రను నీరుగార్చడం కోసం కొందరు వ్యక్తులు తాడేపల్లిగూడెంలో వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలుకుతూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా ఇదో ఫేక్ యాత్ర అంటూ మరికొందరు వైసీపీ సానుభూతిపరులు కౌంటర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది.
రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రా స్టేట్ ముద్దు అంటూ పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రం కోసం జగన్ ఆరాటపడుతున్నారని 26 గ్రామాల కోసం చంద్రబాబు నకిలీ పోరాటం చేస్తున్నారని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అమరావతి రైతులు, టిడిపి, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల పనేనని ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా…ఇబ్బందులు పెట్టినా యాత్ర కొనసాగించి తీరతామంటున్నారు. పాదయాత్రపై తగ్గేదేలే అని రైతులు ముందుకు దూసుకు వెళ్తున్నారు.