సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు మొదలు సుప్రీం కోర్టు వరకు ఏపీ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు నచ్చినట్లుగా మాట్లాడడం…తోచిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వం కోర్టులో పలుమార్లు ఇరకాటంలో పడింది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు, అక్షింతలు వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునివ్వడం…దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం..అక్కడ కూడా చుక్కెదురు కావడం…జరుగుతూనే ఉంది. అయినా సరే జగన్ నడిపిస్తున్న ఏపీ ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై దేశపు అత్యున్నత న్యాయస్థానం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. లాయర్లకు ఫీజు చెల్లించడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ..పర్యావరణ పరిరక్షణపై కనిపించడం లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని, ప్రభుత్వం రూ.120 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
ఆ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం వల్ల పర్యావరణానికి నష్టం కలిగిందని, ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఎందుకు భరించదని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ ఒక్క కేసు విచారణకు ఎంతమంది సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తారని నిలదీసింది. అంతేకాదు, ఈ కేసులో లాయర్లకు ఎంత ఫీజు చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసులు కూడా జారీ చేస్తామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
పోలవరం, పురుషోత్తపట్నం, పులిచింతలపై ఇచ్చిన తీర్పుపై కూడా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు బెంచ్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత, ఎన్జీటీ తీర్పులపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.