ఢిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడే తెలుగు ప్రజలకు అది అందరినీ శాసించే జాతి అనే స్థాయికి గుర్తింపు తేవడంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్నగారు చేసిన కృషి అనన్య సామాన్యమైనదని, తెలుగు వాడికి అంతటి గౌరవం గుర్తింపు తెచ్చిన అన్నగారికి ఆయన సొంత జిల్లా (పూర్వపు కృష్ణా)లో తీవ్రంగా అవమానిస్తూ ఆయన పేరు ను తొలగించడం అత్యంత హేయమైన చర్య అని ఎన్నారై టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే అది ఎన్టీఆర్ కు నష్టం చేసినట్టు కాదని, తెలుగు వారిని నొప్పించినట్టు అని జయరాం కోమటి వ్యాఖ్యానించారు.
10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్న అనితర సాధ్యమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని జయరాం హెచ్చరించారు.
సీఎం జగన్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రతి తెలుగు వాడు తిరగబడతాడు అని జయరాం కోమటి హెచ్చరించారు.
అది ఒక ఉద్యమంలా పైకి కనిపించకపోవచ్చు. ఓటు రూపంలో ఓ పోటు జగన్ కు తెలుస్తుందని, ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే మున్ముందు జగన్ రాజకీయ భవిష్యత్తు పతనమైపోతుందన్నారు.
జగన్ కు ఓటేసిన వారిలోను లక్షల సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారన్న విషయాన్ని జగన్ మరిచిపోయారని, తన జెండాలో నాన్న ఫొటోను లేపేసిన జగన్, తన ఇంటికి నాన్న పేరు కాకుండా లోటస్ పాండ్ అని పెట్టుకున్న జగన్ ఏపీలో ఎన్టీఆర్ నెలకొల్పిన తొలి వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం చారిత్రక తప్పిదం అన్నారు.
జగన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎన్టీఆర్ పేరు పెడితే మంచిది, లేదంటే తిరిగి ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టే వరకు తెలుగు ప్రజలు ఆ విషయాన్ని వదిలిపెట్టరన్నారు.
ఈ విషయం జగన్ గ్రహిస్తే జగన్ కే మంచిదని హెచ్చరించారు.