చిత్తూరు జిల్లా జైలు వద్దకు చేరుకున్న @ncbn గారు.. pic.twitter.com/Qp0Ur6NUXq
— iTDP Official (@iTDP_Official) September 20, 2022
టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా మంగళవారం చిత్తూరులో పర్యటించారు. అయితే.. ఆయన ఈ పర్యటనలో జైలుకు వెళ్లారు. చిత్తూరు జైలులో వివిధ కేసులపై ఉన్న పార్టీ నేతలను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..
కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. జగన్ నేరచరిత్రపై పోరాటం చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారులను.. వదిలిపెట్టబోమని, అందరి గురించి.. రికార్డు నమోదు చేస్తున్నామని.. ఎవ్వరు ఏ చిన్న తప్పు చేసినా.. రేపు వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.
ప్రజాసమస్యల కోసం పోరాడే పార్టీ మాది.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం అన్న క్యాంటీన్ ఘటనలో 72మంంది టీడీపీ నేతలపై కేసు పెట్టారని.. మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. టీడీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు దారుణమని మండిపడ్డారు.
మీరు దాడులు చేసి.. తిరిగి మా నేతలపై కేసులు పెట్టారని.. సమావేశం పెట్టినప్పుడు ప్రజలు రారా అని ప్రశ్నించారు.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ జైలుకెళ్లి ఎవరినీ పరామర్శించలేదని.. మొదటిసారి చిత్తూరు జైలులో ఉన్న 8 మంది కార్యకర్తలను పరామర్శించానని చంద్రబాబు తెలిపారు.
జగన్ను తరిమికొట్టే రోజు వస్తుందని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనే కాదు.. పులివెందులలోనూ గెలుస్తామని సవాల్ విసిరారు. పోలవరం, అమరావతిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. టీడీపీ సంపదను సృష్టిస్తే.. వైసీపీ విధ్వంసం చేస్తోందని.. విధ్వంసాన్ని అడ్డుకుంటే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పోలీసుల్లో 90 శాతం మంది మంచివాళ్లే ఉన్నారని.. మిగిలిన 10 శాతం మందితోనే సమస్య అని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసును మరో రాష్ట్రానికి మార్చాలని ఆయన కుమార్తె అడిగిందని.. సీబీఐను కూడా బెదిరించే గొప్ప వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.టీడీపీ హయాంలో రౌడీలు, గూండాలను అణచివేశామన్నారు. కానీ, వాళ్లే ఇప్పుడు పాలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.