అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని గ్రామ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాజధాని పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. ఇందుకోసం అప్పట్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ముక్తకంఠంతో ఆ ప్రతిపాదనను తిప్పికొట్టారు.
29 పంచాయతీలతో నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు రాజధాని పరిధి తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ జారీ చేసిన ఉత్తర్వులపై 21 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణకు గుంటూరు కలెక్టర్ చర్యలు చేపట్టారు.
పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, మండల పరిషత్ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆయన ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తాఖీదులిచ్చి తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో తాజాగా అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల్లో గ్రామసభలు కొనసాగుతున్నాయి. తొలుత లింగాయపాలెంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు.
ఇక్కడ 78 మంది స్థానికులు మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకించగా.. ఒకే ఒక్కరు అనుకూలంగా మద్దుతు తెలిపారు. ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన రెండో సభలో మున్సిపాలిటీ ఏర్పాటును ప్రజలంతా సామూహికంగా వ్యతిరేకించారు. ఈ రెండు గ్రామాల్లో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును ప్రజాభిప్రాయం ద్వారా తిరస్కరించారు.
హరిశ్చంద్రపురంలో మరో గ్రామసభ ప్రారంభమైంది. అయితే.. ఇక్కడ అసలు ప్రజలు ఎవరూ రాలేదు. వచ్చిన కొద్ది మంది కూడా వ్యతిరేకించడం గమనార్హం. దీంతో అమరావతి విషయంలో సర్కారుకు మరో భారీ దెబ్బతగిలినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.