న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలకు తమకు తోచినట్లుగా అన్వయించుకొని నిర్ణయాలు తీసేసుకోవటం.. వాటిని తప్పు పట్టే వారికి.. కోర్టులే చెప్పాయన్న మాటలు చెబుతూ.. కొత్త సందేహాలకు తావిచ్చేలా వ్యవహరించే ప్రభుత్వాలకు మన దేశంలో కొదవ ఉండదు. గతంలో ఇలాంటి తీరు ఒక స్థాయి వరకే ఉండేవి.
ఇప్పుడు అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషుల్ని విడుదల చేసే విషయంలో కేంద్రం.. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం మాడు పగిలే వ్యాఖ్యల్ని చేసింది.
ఇంతకీ ఈ బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు విషయానికి వస్తే.. 2002లో గుజరాత్ అల్లర్ల వేళ ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆమె బంధువులైన ఏడుగురిని హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితులకు న్యాయస్థానం జీవితఖైదును విధించింది. పదిహేనేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో పంద్రాగస్టు నేపథ్యంలో వారికి క్షమాభిక్ష పెడుతూ గుజరాత్ ప్రభుత్వానికి చెందిన కమిటీ విడుదల చేసింది.
దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దారుణ నేరాలకు పాల్పడిన వారిని క్షమాభిక్ష పేరుతో ఎలా బయటకు వదులుతారన్న ప్రశ్నలు వచ్చాయి. దీనికి కోర్టులో చెప్పాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇలాంటివేళ.. ఈ విడుదలను సవాలు చేస్తూ సీపీఎం నేత సుభాషిణి అలీ.. జర్నలిస్టు రేవతీ లౌల్.. ఉద్యమకారిణి రూపా రేఖారాణిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తోకూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తలంటు పోసేలా సుప్రీం వ్యాఖ్యలు ఉన్నాయి. ముందస్తు విడుదల కోరుతూ నిందితులు దాఖలు చేసిన దరఖాస్తునుపరిశీలించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా అర్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
శిక్ష పడిన దోషుల్ని విడుదల చేసేందుకు న్యాయస్థానమే అనుమతించినట్లుగా ఎక్కడోతాను చూశానని.. అది సరికాదన్నారు. క్షమాభిక్ష పేరుతో విడుదలైన పదకొండు మందిని కూడా తాజా వ్యాజ్యంలో చేర్చాలన్న సుప్రీం.. దోషుల విడుదలను తప్పుపట్టిన అంశాన్ని సూటిగా చెప్పేసింది. మొత్తానికి తాను సీజేఐ పదవి నుంచి తప్పుకోవటానికి ఒక రోజు ముందు.. జస్టిన్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు కీలకమని చెప్పక తప్పదు.