వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను నరసాపురం పర్యటనకు రాకుండ సీఎం జగన్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రఘురామపై హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. రఘురామ, ఆయన కుమారుడు భరత్, రఘురామ పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు.
అనుమతి లేకుండా తన ఇంటిపై నిఘా పెట్టిన ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను రఘురామ అనుచరులు అదుపులోకి తీసుకున్నారని కేసు నమోదైంది. అయితే, ఆ కేసు కొట్టివేయాలంటూ రఘురామ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా…ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను రఘురామ ఇంట్లో నిర్భందించి దాడి చేశారని, దానికి సాక్ష్యాలున్నాయని ఏపీ పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే తనపై, తన కుమారుడిపై నమోదైన కేసు కొట్టేయాలంటూ రఘురామ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రఘురామకు షాకిచ్చింది. రఘురామ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కాబట్టి విచారణ జరగనివ్వాలని, ఈ దశలో కేసును కొట్టివేయాలని కోరడం సబబు కాదని అభిప్రాయపడింది. దీంతో, తెలంగాణ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టులో కూడా రఘురామకు షాక్ తగిలినట్లయింది.
Comments 1