కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, ఖజానా నింపుకునేందుకు ప్రజలపై సైలెంట్ గా రకరకాల రూపాలలో పన్నులు బాదుతున్నారని ఆరోపిస్తున్నాయి.
భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు, టోల్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ దాదాపు 20 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్…ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ఆఖరికి దేవుళ్లనూ వదలలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తిరుమల గదుల అద్దెను పెంచిన జగన్ సర్కార్…తిరుమల లడ్డు ధరను రెట్టింపు చేశారని విమర్శలు వస్తున్నాయి.
ఇవేమీ పట్టని జగన్ బెజవాడ కనకదుర్గమ్మ గుడి పార్కింగ్ ఫీజు పెంచేసి ఖజానా నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన కోటప్పకొండ తిరుణాళ్లను జగన్ వదలకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండ శైవ క్షేత్రంలో కారు పార్కింగ్ ఫీజును రూ.100కు పెంచడంపై పల్నాడువాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండపై కొలువైన శివుడిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి సందర్భంగా భారీ స్థాయిలో తిరునాళ్ల జరుగుతుంది.
దీంతో, తిరునాళ్ల సందర్భంగా జగన్ సర్కార్…ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ ఫీజును 100 రూపాయలకు పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై జగన్ సర్కార్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పార్కింగ్ ఫీజుతోనే జగన్ ప్రభుత్వాన్ని నడిపేలా ఉన్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే రకరకాల బాదుళ్లతో జనం నడ్డి విరుస్తోన్న జగన్…ఆఖరికి పార్కింగ్ ఫీజులనూ వదలకుండా కక్కుర్తిపడి ఖజానా నింపుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.