ఎట్టకేలకు సీఎం జగన్ తన పంతం నెగ్గించుకున్నారు. తన పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామను ఇరకాటంలో పెట్టాలని ఫిక్సయిన జగన్…అనుకున్నదే చేశారు. నరసాపురంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణకు రఘురామ రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే, ఇందుకు జగన్ అనుసరించిన విధానాలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకున్న జగన్..చివరకు రఘురామను అడ్డుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో గానీ, వేదికపై ఉండే వారి జాబితాలో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో కానీ రఘురామకృష్ణరాజు పేరు లేకుండా జగన్ ప్లాన్ వేశారు. అయితే,రఘురామ పేరు అందులో లేదు కాబట్టే ఆయన అక్కడకు రాకూడదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అన్నారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తెలియదని, తాము మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు.
అంతకుముందు, మోదీ పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రఘురామరాజు.. భీమవరం వెళ్లేందుకు గతరాత్రి హైదరాబాద్లో రైలెక్కారు. అయితే, ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కేసులు పెట్టారని ఆయనకు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రఘురామ బేగంపేటలోనే రైలుదిగారు.
ప్రొటోకాల్ విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకనే ఆయన భీమవరం రాకుండానే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. దీంతో, రఘురామ భీమవరం పర్యటనకు రాకుండా హైదరాబాద్ లోనే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రధానికి లేఖ రాశారు. పర్యటనకు రాలేకపోతున్నానని, ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఆహ్వానం లేకపోవడంతో తాను పర్యటనలో పాల్గొనలేదని అన్నారు.