మంత్రులూ ఆయన ముందు బలాదూర్
పెత్తనమంతా ఆయనదే
వైసీపీ ప్రచారవేదికగా పబ్లిసిటీ సెల్
ఆయన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు (ఐఐఎస్) అధికారి. డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఏకంగా సమాచార శాఖకు కమిషనర్ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కల్పించాల్సిన శాఖాధిపతిగా ఉన్న ఆయన తన అధికార పరిధిని ఎప్పుడో దాటిపోయారు. మంత్రులను పక్కకు నెట్టేశారు. ఆ శాఖలోని సీనియర్ అధికారులందరినీ మూలనకూర్చోబెట్టారు. సర్వం ఆయనే. ప్రభుత్వం కంటే వైసీపీకి ప్రచారం కల్పించడానికే తన శాఖను ఉపయోగిస్తున్నారు. సీఎం చల్లనిచూపు ఉంటే చాలు.. ఇంకొంతకాలం ఇలాగే ఉండిపోతా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
అందులో భాగంగానే తన పరిధికాని, తనకు అధికారం లేని విషయాల్లో పత్రికలకు లీగల్ నోటీసు జారీ చేసే స్థాయికి వెళ్లిపోయారాయన. తానో ప్రభుత్వ అధికారినన్న విషయం మరచిపోయి వైసీపీ ప్రచారకర్తగా మారిన ఆయన పేరు విజయ్‌కుమార్‌రెడ్డి. తాను ఏం చెబితే అదే జరగాలన్న వ్యవరశైలిని చూసి అధికార యంత్రాంగం ముక్కున వేలేసుకుంటోంది. సాధారణంగా సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి ప్రచారం బాధ్యతలు చూస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల అవసరాలకు తగినట్లుగా సమాచారం సిద్ధం చేసి.. అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను సంబంధిత శాఖ మంత్రులు, విభాగాధిపతుల పేరిట విడుదల చేస్తుంది.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి, ఇతర ప్రైవేటు వ్యక్తులకు మౌతపీస్గా పనిచేయదు. అలాంటి శాఖ విజయ్‌కుమార్‌రెడ్డి పుణ్యమా అని చెప్పలేనంత అపకీర్తిని మూటగట్టుకుంటోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులను కూడా పక్కనపెట్టేసి కమిషనర్ పేరిట, ఆయనే చెప్పినట్లుగా ప్రకటనలు విడుదల చేయడం ద్వారా కమిషనర్ ఆ శాఖను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. సమాచార శాఖ అధికారంగా ఏర్పాటు చేసిన మీడియా పబ్లిసిటీ గ్రూపుల ద్వారా అధికారపార్టీ వైసీపీ సమాచారం కూడా విడుదల చేస్తున్నారు. సమాచార శాఖలో పార్టీల సమాచారం ఇవ్వడం తప్పని ఎవరైనా అడ్డుచెబితే వారికి తీవ్ర పరిణామాలే ఎదురవుతున్నాయి.
తాను ప్రభుత్వ శాఖకు అధికారి అన్న విషయాన్ని మరచిపోయారా అన్నంతగా వ్యవహరిస్తూ.. ముఖ్యమంత్రిని మెప్పిస్తే చాలు…అదే నా ఉద్యోగం అన్నట్లుగా సమాచార శాఖను రాజకీయ ప్రచార వేదికగా మార్చేసి దాని పరువుతీశారన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పాల్గొన్న కార్యక్రమాలకు కవరేజీ ఇచ్చే విషయంలో సహజంగానే సీఎంకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. మంత్రులు తాము ప్రాతినిధ్యం వహించే శాఖల సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు వారికి ప్రాధాన్యమివ్వాలి. వారు చెప్పిన అంశాలతో ప్రకటన విడుదల చేయాలి.
వివిధ వర్గాల సంక్షేమం కోసం ఏదైనా శాఖ తరపున ప్రభుత్వం కొత్తగా కార్యక్రమం శ్రీకారం చుట్టాలనుకుంటే ముందుగా ఆ శాఖ తరపున పెద్ద ఎత్తున ప్రకటనలు, సమాచారం విడుదల చేస్తున్నారు. కమిషనర్ ఈ పద్ధతికి నీళ్లొదిలారు. శాఖ ఏదైనా, పథకం ఏదైనా సమాచర శాఖ కమిషనర్ పేరిట ప్రకటనలు ఇస్తున్నారు. దీంతో మంత్రులు నొచ్చుకుంటున్నారు. ఆయన్ను ఏమైనా అందామంటే సీఎం దాకా విషయం వెళ్తుందేమోనని భయపడిపోతున్నారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఆయా శాఖల పేరిట ప్రకటనలు ఇస్తూ సీఎం జగన్‌ను మరింతగా ప్రసన్నం చేసుకునేందుకు కీర్తనలు ప్రారంభించారు.
ఇటీవల గిరిజనులకు అటవీ భూములపై హక్కులు(ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల) పంపిణీ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారని సమాచార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఇప్పటికే గిరిజన మహిళకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన సీఎం జగ న్మోహన్రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక సంస్థల పదవుల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించింది. బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా గిరిపుత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తున్నారని సమాచార శాఖ కమిషనర్ విజయ్కుమార్రె డ్డి తెలిపారు’ అని ఆ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎంను కీర్తిస్తూ సమాచార శాఖ కమిషనర్ ప్రకటన ఇచ్చినట్లుగానే ఉంది. ఇందులో అటవీ, గిరిజన శాఖ మంత్రులు, అధికారుల ప్రస్తావన లేనేలేదు.
జగనన్న విద్యాకానుక పథకం ప్రకటన విడుదలలోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగించారు. దీంతో విద్యాశాఖ వర్గాలు ఇదేం పద్ధతంటూ గుర్రుమన్నాయి. అయితే, ఆయన సొంతంగా ప్రకటనలు ఇచ్చిన శాఖలు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మంత్రులవే కావడం గమనార్హం. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, నిపుణులు, ఇంకా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వాలి. సూచనలు చేయాలి. కానీ సమాచార కమిషనర్ ఆ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఆయనే సలహాలు, సూచనలు ఇస్తూ పత్రికా ప్రకటనలు జారీ చేశారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆయన చర్యలు ప్రభుత్వ ప్రచారం కన్నా సొంత పబ్లిసిటీని తలపిస్తున్నాయన్న విమర్శలు వినిపించాయి.
ప్రైవేటు పబ్లిసిటీ..
గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సమాచార శాఖ వాటికి సంబంధించి ఏ ప్రకటన జారీ చేసేదికాదు. అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యేది. మహా అయితే, ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన సీఎంకు ఫలానా వారు స్వాగతం పలికారని ఓ చిన్న సమాచారం విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాదు. కమిషనర్ ఆదేశాల మేరకు భారీగా ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మామయ్య ఈసీ గంగిరెడ్డి ఆ మధ్య చనిపోయారు.
సమాచారం తెలిసి సీఎం హుటాహుటిన వెళ్లారు. సీఎం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం ఇవ్వాలి. కానీ సమాచార శాఖ గంగిరెడ్డి ఘనతల గురించి అనేక ప్రకటనలు జారీ చేసింది. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు ప్రజలు భారీగా త రలివస్తున్నారని అధికారికంగా ఓ ప్రకటన ఇచ్చింది.
సమాచార శాఖ విలవిల…
సమాచార శాఖలో అనేక మంది సీనియర్ అధికారులు ఉన్నారు. వీరు గతంలో అనేక ప్రభుత్వాలను చూశారు. అలాంటి వారందరినీ పక్కనపడేసి కేవలం ఒక అధికారి చెప్పినట్లే కమిషనర్ నడుచుకుంటున్నారని, ఆ అఽధికారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిగువస్థాయి సిబ్బందిని ఎంతలా సతాయిస్తున్నారంటే.. సమాచార శాఖ అధికారులను వైసీపీ ప్రచారకర్తలుగా మార్చేసేదాకా వెళ్లింది. గ్రామ సచివాయాలు ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆ మధ్య పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆ పార్టీ నిర్వహించే ఈ కార్యక్రమాలకు వచ్చి కవర్ చేయాలని సమాచార శాఖ అధికారి ఒకరు మీడియాకు వర్తమానం పంపారంటే వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో ఊహించుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రకటనలు అనేక సందర్భాల్లో ఆ శాఖ ద్వారా మీడియాకు వస్తున్నాయి. ఇదే అధికారులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు. కమిషనర్ ఒత్తిడి చేస్తుంటే మేం ఏం చేయాలని వారు వాపోతున్నారు.