యువరాజు.. అమూల్ బేబీ.. రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి చూపని వ్యక్తి.. తరచూ విదేశాలకు వెళుతుంటాడు.. ఇలా ఒక జాతీయ నాయకుడికి ఎన్ని ముద్రలు అయితే పడకూడదో అన్ని ముద్రలు వేయించుకోవటమే కాదు.. ఇప్పుడు కూడా ఏదో ఒక మాటను అనేసే నేతగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని చెప్పాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి రాహుల్ గాంధీనే అసలుసిసలు అప్షన్ గా చెప్పొచ్చు. పేరుకు పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికి.. వారెవరూ పార్టీని అన్నీ తామై నడిపించే సత్తా ఉన్నోళ్లు ఎంత మాత్రం కాదన్నది తెలిసిందే.
రాహుల్ విషయానికి వస్తే.. నిజానికి ఆయనకు దేశ ప్రధాని అయ్యే ఆలోచన ఉండి ఉంటే.. 2004 తర్వాత ఏదో ఒక రోజున అయిపోయి ఉండేవారు. కానీ.. ప్రధాన మంత్రి పదవి పలుకరిస్తున్నా.. దాని జోలికి వెళ్లకుండా ఉండటం అందరికి సాధ్యమయ్యే విషయం కాదు. ఇందులో మాత్రం ఆయన్ను అభినందించకుండా ఉండలేమని చెప్పాలి. ఎందుకంటే.. ప్రధాని పదవిని చేపట్టేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని రాహుల్ వినియోగించుకోలేదని చెప్పాలి.
అలాంటి ఆయన.. ఇప్పుడు మాత్రం దేశ ప్రధాని కావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు పెద్ద జెయింట్ గా మారిన నరేంద్ర మోడీని దెబ్బ కొట్టి ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించటం ద్వారా ప్రధానమంత్రి పగ్గాల్ని చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఇలాంటి వేళ.. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో రాహుల్ ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏ జాతీయపార్టీకి చెందిన కీలక నేత సైతం ప్రయత్నించని ఒక భారీ కార్యక్రమానికి రాహుల్ తెర తీశారు. దేశానికి ఒక మూల చివర కొసగా ఉండే కన్యాకుమారి నుంచి బయలుదేరి.. భారత సరిహద్దులైన కశ్మీర్ అనే మరో కొస వరకు ఆయన పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. అక్టోబరు 2న ప్రారంభమయ్యే భారత్ జోడో పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు రాహుల్ తెర తీశారు.
ఇందులో భాగంగా రాహుల్ గాందీ 148 రోజుల్లో 12 రాష్ట్రాల్లోని 203 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొత్తం 3600 కిలో మీటర్ల మేర రాహుల్ గాంధీ నడవనున్నారు. ప్రస్తుతం రాహుల్ యూరోప్ పర్యటనకు వెళ్లారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా పేర్కొనే ఈ టూర్ రాష్ట్రపతి ఎన్నిక.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యక్రమానికి ముందుగా దేశానికి తిరిగి వస్తారని చెబుతున్నారు. ఓ పక్క కాంగ్రెస్ లో ఒకటి తర్వాత మరొకటి చొప్పున సవాళ్లు ఎదురవుతున్న వేళలో.. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూర్తి వ్యక్తిగత పర్యటనలకు వెళుతున్న రాహుల్ తీరుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఏది ఏమైనా.. మొదటిసారి భారీ సాహసం.. అంతకు మించిన ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చే వినూత్న కార్యక్రమానికి రాహుల్ ఓకే చెప్పిన తీరు చూస్తే.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందస్తుగా పాదయాత్రకు తయారవుతున్న వైనం.. దేశ రాజకీయాల్ని రాహుల్ తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయాన్ని వెల్లడించటం ఆసక్తికరంగా మారింది. ఇక.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తానే అసలుసిసలు ప్రత్యామ్నాయమన్న మాటకు అర్థం తెలిసేలా రాహుల్ తీరు ఉంటుందని చెప్పక తప్పదు. మొత్తానికి చూస్తే.. దేశ రాజకీయాల్లో చాలా అరుదైన పరిణామాలకు రాహుల్ పాదయాత్ర ఒక బలమైన కారణంగా మారుతుందని చెప్పక తప్పదు.
Comments 1