రేణిగుంటలో దాదాపు 9 గంటలుగా కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, రూరల్ ఎస్పీతో చర్చలు జరిపిన అనంతరం టీడీపీ జాతీయాధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ బయలుదేరారు. చిత్తూరు, తిరుపతి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని చంద్రబాబు వారికి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై చంద్రబాబుతో చిత్తూరు జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ చర్చించారు. చంద్రబాబు ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతోచంద్రబాబు స్వచ్ఛందంగానే హైదరాబాద్ కు వెళ్లేందుకు అంగీకరించారు. ఈ రోజుకు హైదరాబాద్ వెళ్లేందుకు 7.10కి చివరి ఫ్లైట్ ఉందని పోలీసులు నచ్చజెప్పడంతో చంద్రబాబు అయిష్టంగానే ఆ విమానంలో హైదరాబాద్ కు పయనమయ్యారు. చంద్రబాబు పర్యటన అనుకున్నట్టుగా విజయవంతం అయి ఉంటే…ముందస్తు షెడ్యూల్ ప్రకారం 7.10కి ఇదే విమానంలో చంద్రబాబ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.
అయితే, అప్పటికే తన కోసం వేలాది మంది టీడీపీ కార్యకర్తలు రేణిగుంట చేరుకోవడం, రేణిగుంట వస్తోన్న టీడీపీ కార్యకర్తలు, అప్పటికే విమానాశ్రయం బయట ఉన్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరిణామాలతో చంద్రబాబు తీవ్రంగా కలత చెందారని తెలుస్తోంది. తన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వెనుదిరిగారని, లేకుంటే పోలీసులు అనుమతించే వరకు దీక్ష కొనసాగించాలని భావించారని తెలుస్తోంది.