ఏపీ సీఎం జగన్ పరువు పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఫుల్లుగా పోయిందా? ఏపీలో జరుగుతున్న జగన్ పాలనపై తెలంగాణలోనూబీజేపీ దుమ్మెత్తి పోస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజా గా.. తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయకుడు.. రాజా సింగ్.. జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. తనకు కనుక పార్టీ హైకమాండ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తానని చెప్పారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్పై రాజా సింగ్ నిప్పులు చెరిగారు.
సీఎం జగన్ సొంత జిల్లా కడప నుంచి అక్రమంగా ఆవులను రాత్రి పూట వాహనాల్లో తరలిస్తున్నారని, అక్కడే వధించి మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిపై విమర్శలు చేస్తున్న బీజీపీ కార్యకర్తలపై టార్చర్ ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో మత మార్పిడులపై ఫైట్ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉంటే హిందువులకు నష్టమని వ్యాఖ్యానించారు. వైఎస్ గానీ జగన్ కానీ హిందువులకు చేసిన డ్యామేజ్ చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. ఊళ్లకు ఊళ్లను కన్వర్ట్ చేశారని తెలిపారు.
ఏపీలో గోరక్షణ చేసే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు జగన్కు వ్యతిరేకంగా ఉన్నా.. పోరాడడంలో మాత్రం వెనుకబడ్డారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ధర్మ ప్రచారం…గోరక్షణ చేస్తానన్నారు. “ఒక్క పాస్టర్ ప్లాన్ చేసి గుళ్లపైన దాడులు చేయించినా.. కేసును ఎందుకు పక్క దోవ పట్టిస్తున్నారు? ఫాస్టర్ వెనుక ఎంత మంది ఉన్నారో ఇంకా బయటకు రాలేదు. ఫండింగ్ చేస్తున్నది ఎవరు? ఎన్ని గుళ్లు ధ్వంసం చేశారు.. ఎంతమందిని చంపారు.. అనే వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉంది. అయినా బయటపెట్టడం లేదు“ అని రాజాసింగ్ దుమ్మెత్తి పోయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం.