ఒకసారి సినిమాల్లోకి అడుగు పెట్టి కొంచెం పేరు సంపాదించాక.. అంత ఈజీగా ఈ రంగం నుంచి తప్పుకోరు ఎవరూ. హిట్లు లేకపోయినా, సినిమాలు తగ్గినా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే కెరీర్లో జోరు తగ్గగానే సైడైపోతారు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా ఏదో వ్యాపారమో, ఉద్యోగమో చేసుకుంటూ కాలం గడిపేస్తారు.
నటుడు తొట్టెంపూడి వేణు కూడా ఈ తరహాకే చెందుతాడు. సూపర్ హిట్ మూవీ ‘స్వయంవరం’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాలతో అతను చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని అతను క్యారెక్టర్లను పండించాడు.
సోలో హీరోగా అవకాశాలు తగ్గాక కూడా పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ చిత్రాల్లో అతను ఎంతగా నవ్వించాడో తెలిసిందే. ఐతే ఒక దశ దాటాక అవకాశాలు తగ్గడంతో అతను సినీ రంగానికి దూరమయ్యాడు. చివరగా అతను ‘చింతకాయల రవి’ సినిమాతో పలకరించాడు.
ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన వేణుని ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం తిరిగి సినీ రంగంలోకి తీసుకొచ్చాడు కొత్త దర్శకుడు శరత్ మండవ. ఈ చిత్రంలో సీఐ మురళి పాత్రలో వేణు కనిపించబోతున్నాడు. ఈ రోజే అతడి ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.
ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటున్నాడు వేణు. పర్టికులర్‌గా వేణునే ఈ పాత్రకు ఎంచుకోవడం గురించి శరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఈ పాత్రకు సుమంత్, జగపతిబాబులను కూడా అనుకున్నాను. వేణు పేరు కూడా తెరపైకి వచ్చింది. సుమంత్ వేరే సినిమాలో బిజీగా ఉన్నాడు.
వేణు అయితే కొంచెం కొత్తగా ఉంటుదని అనిపించి అతడి మేనేజర్‌ను సంప్రదించాను. కానీ వేణు నటించడానికి ఒప్పుకోలేదు. సినిమాలు మానేశానని, బిజినెస్‌లో బిజీగా ఉన్నానని.. తనను గుర్తుంచుకున్నందుకు థ్యాంక్స్ చెప్పమని చెప్పి పంపాడు. కానీ నేను రెండుసార్లు ఆయన వెంట పడ్డాను.
చివరికి తన పాత్ర పేపర్ మీద ఎంత ఉంది, సినిమాలో ఎంత ఉంటుంది, ఎంత కట్ చేస్తారు అని అడిగాడు. ఒక్క సీన్ కూడా తీయనని.. యాజిటీజ్ ఉంటుందని చెబితే ఓకే అని నటించాడు. ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని శరత్ తెలిపాడు.