2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం కూడా ఒక కారణం అన్నది ఎవ్వరైనా అంగీకరించే విషయం. జనసేన ఎన్నో నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి వైకాపా విజయానికి తోడ్పడింది. ఈ నేపథ్యంలో తర్వాతి ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టాలంటే తెలుగుదేశం, జనసేన జట్టు కట్టి తీరాలన్నది మెజారిటీ అభిప్రాయం. ఈ దిశగా ఇటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సానుకూలంగానే స్పందించారు. పరోక్షంగా పొత్తు సంకేతాలు ఇచ్చారు.
కానీ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు మాత్రం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగుతూ పొత్తు దిశగా వ్యతిరేక సంకేతాలు ఇస్తున్నారు. రెండు పార్టీల మీద పరస్పరం తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుపోసుకుంటూ, ఒకరినొకరు కించపరుచుకుంటూ పొత్తు విషయంలో సందేహాలు రేెకెత్తిస్తున్నారు.
పొత్తుల విషయంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన-బీజేపీ లేదా జనసేన-తెలుగుదేశం-బీజేపీ లేదా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్థాయంటూ మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా 2014, 2019 ఎన్నికల్లో తగ్గామని.. 2024లో మాత్రం తగ్గేది లేదని, అవతలి వాళ్లే తగ్గాలని చెప్పడం ద్వారా.. తెలుగుదేశం పార్టీనే తమ వద్దకు రావాలని, పొత్తులో భాగంగా తాము కోరుకున్న సీట్లను ఇవ్వాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఐతే దీనిపై తెలుగుదేశం మద్దతుదారులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఒంటరిగా పోటీ చేసి జనసేన ఒక్క సీటుకు పరిమితం కావడం, పవన్ కూడా గెలవకపోవడాన్ని ఎద్దేవా చేస్తూ.. జనసేనను, పవన్ను తీవ్ర స్థాయిలో దూషిస్తూ.. మీతో పొత్తు అవసరం లేదని చెబుతూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని పోస్టులైతే జనసేనను మరీ కించపరిచేలా ఉన్నాయి.
స్వయంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నాయకుడు జనసేనను తక్కువ చేసేలా ఒక పోస్టు పెట్టారు. దీంతో జనసేన వాళ్లకు మండిపోయింది. తెలుగుదేశంతో పొత్తు అవసరమే లేదంటూ, ఆ పార్టీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. 2014లో పవన్ మద్దతుతో తెలుగుదేశం గెలవడం, 2019లో ఆయన మద్దతు కోల్పోయి 23 సీట్లకు పరిమితం కావడాన్ని ఎత్తి చూపుతూ.. అదే స్థాయిలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో వాళ్లు కూడా టీడీపీని, చంద్రబాబును కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘర్షణ అంతకంతకూ పెరిగిపోయి.. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనేలా చేస్తుండడంతో పొత్తు అటెక్కేస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. అధికార వైకాపాకు కావాల్సింది ఇదే కావడంతో ఆ పార్టీ మద్దతుదారులు.. ఈ ఘర్షణను మరింత పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.