అగ్రరాజ్యం అమెరికాలో మనదేశం జనాభా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాల జనాభా ముఖ్యంగా చైనా, ఆఫ్రికా దేశాల జనాలు కూడా పెరిగిపోతున్నారు. ఇందుకనే ఇతర భాషలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తాజాగా అధ్యక్షుడి సలహా సంఘం నిర్ణయించింది. ఈ సిఫారసులను గనుక అధ్యక్షుడు ఆమోదిస్తే ఆ ఫైల్ అమెరికన్ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటారు. అంటే అధ్యక్షుడి ఆమోదం పొందితే మిగిలినది లాంఛనమే అవుతుంది.
సిఫారసులు ఎలాగున్నాయంటే అధ్యక్ష భవనం వైట్ హౌస్ కార్యక్రమాలు, కార్యకలాపాలతో పాటు ఫెడరల్ ప్రభుత్వ వెబ్ సైట్లలో ఇంగ్లీషులో మాత్రమే సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే సలహా సంఘం సిఫార్సులు గనుక ఆమోదం పొందితే ఇకనుండి ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, గుజరాతీ, పంజాబీ లాంటి భాషల్లో కూడా కనబడుతుంది. ఇదే సందర్భంలో ఏషియన్ అమెరికన్ల మాతృభాషలో కూడా ట్రాన్స్ లేటెడ్ వర్షన్ కనబడటం ఖాయం.
అమెరికాలో ఏషియన్ అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 2060కి వీరి సంఖ్య 6 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ప్రస్తుతం అమెరికాలో 2.5 కోట్ల మంది ఇళ్ళల్లో ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు. 2020 లెక్కల ప్రకారం వీరిలో ఇంగ్లీషు మాట్లాడే కెపాసిటి లేదని అర్ధమైంది. అయితే ఇంగ్లీషు రాకపోయినా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో వీళ్ళు పరిశ్రమలు, సంస్ధలు ఏర్పాటు చేయటం ద్వారా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.
వీరు ఏర్పాటుచేసిన సంస్ధలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి వందల కోట్ల డాలర్ల జీతాలు చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికాకు వీళ్ళనుండి పన్నుల రూపంలో మంచి ఆదాయం వస్తోంది. అందుకని కేవలం ఇంగ్లీషు రాదన్న కారణంతో వీళ్ళని వదులుకునే అవకాశం లేదు. అందుకనే వీళ్ళ భాషల్లో కూడా కార్యకలాపాలను ట్రాన్స్ లేటెడ్ వర్షన్ అందిస్తే వీళ్ళకూ సౌకర్యంగా ఉంటుందని సలహా సంఘం అధ్యక్షుడికి సూచించింది. మొన్నటి అధ్యక్షుడి ఎన్నికల్లో జో బైడెన్ తరపున అనేక భాషల్లో ప్రచారం చేయటంతో బైడెన్ కు ఆధరణ దొరికింది. కాబట్టే దీన్ని పర్మినెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.