ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లకు సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేయబోతున్నారన్న విషయంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ తరఫున ఆ నలుగురు ఎవరు అన్న సస్పెన్స్ కు నేడు సీఎం జగన్ తెరదించారు. తుది జాబితాను సీఎం జగన్ ఖరారు చేయగా… మంత్రి బొత్స సత్యనారాయణ ఆ నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఊహించినట్లే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి జగన్ మరో చాన్స్ ఇచ్చారు.
జగన్కు వ్యక్తిగత న్యాయవాదిగా కొనసాగుతున్న నిరంజన్ రెడ్డికి వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు, బీసీ సంఘాల జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలకు మిగతా రెండు సీట్లను జగన్ కేటాయించారు. ఈ క్రమంలోనే రాజ్య సభ అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
ఏపీ కోటాలోని రాజ్యసభ సీట్లను తెలంగాణకు చెందిన వ్యక్తులకు కేటాయించడంపై అయ్యన్న ఫైర్ అయ్యారు. ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాలలో ఏ ఒక్క నేతకూ పెద్దల సభకి వెళ్లే అర్హత లేదా? అని జగన్ను నిలదీశారు. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదని అనుకుంటున్నారా? అని జగన్ను అయ్యన్న ప్రశ్నించారు. నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని అయ్యన్న గుర్తు చేశారు.
కానీ, ఏపీకి సీఎం అయిన మొదటి రోజునుంచే జగన్ ఏపీ నిధులు, నీళ్లు, నియామకాలన్నీ తెలంగాణకి దోచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. నిధులు, విధులతోపాటు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని ఉత్తుత్తి 56 కార్పొరేషన్లను ఏపీ బీసీలకి విదిల్చారని మండిపడ్డారు. తెలంగాణ బీసీలకు మాత్రం అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం…ఏపీలో వెనకబడిన తరగతుల నేతలకి వెన్నుపోటు పొడవడమేనని అయ్యన్న విమర్శించారు.