ప్రజా సంక్షేమ పథకాలతో వైసీపీకి జనం పట్టం కట్టారని..జగన్ ను సీఎంను చేశారని వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జనం కోసం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారని, చేస్తున్నారని, చేస్తూనే ఉంటారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఏపీ మీద ఉన్న అప్పులు పదేళ్లలో అయినా తీర్చుకోవచ్చని…జనం ప్రాణాలు కాపాడేందుకు అప్పులు చేసిన గొప్ప సీఎం జగన్ అని తమ అధినేతకు కితాబిస్తున్నారు.
అసలు, అప్పులు చేస్తే తప్పేంటని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు వైసీపీ నేతలు. అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలే కాదు…కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చెబుతోంది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని తేల్చి చెప్పింది. అయినప్పటికీ, ఏనుగు మీద నీళ్లుపడ్డట్టున్న జగన్ సర్కార్…తమ అప్పుల తప్పులను సమర్థించుకుంటూ….అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ మరో 2 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేయడం చర్చనీయాంశమైంది. రూ.1000 కోట్లను 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేయగా…మరో రూ.1000 కోట్లను 5 సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో వేలం వేసింది. గత వారం రోజుల్లో దాదాపు రూ.5 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం .
ఎఫ్ఆర్బిఎం కింద రూ.36 వేల కోట్లకు కేంద్రం అనుమతినివ్వగా ఆల్రెడీ రూ.5 వేల కోట్ల రుణాన్ని సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా జగన్ సర్కార్ సమీకరించింది. ఇక, మరో 3 నెలల్లో రూ.36 వేల కోట్లు పరిమితి పూర్తయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ అప్పు చేయడం విశేషం. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అప్పులపై ఈ వామపక్ష పార్టీ సీనియర్ నేత షాకింగ్ కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది.
జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉంటుందని రామకృష్ణ విమర్శలు గుప్పించారు. చేసిన అప్పులకు జగన్ లెక్కలు చెప్పడం లేదని, అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టును జగన్ మూలన పడేశారని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుంటే జగన్ నోరు మెదపడం లేదని, ప్రధానికి కనీసం జగన్ ఒక అర్జీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
మద్యపాన నిషేధమన్న జగన్…పాత బ్రాండ్లను నిషేధించి, తమ పార్టీ నేతల బ్రాండ్లను ప్రజల్లోకి వదిలారని ఆయన ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బు తాడేపల్లికి వెళుతుందని ఆయన ఆరోపించారు. సీఎం అయిన 2 వారాల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఇంతవరకు ఎందుకు చేయలేదని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ కలరాస్తున్నాడని, విజయవాడకు వస్తే అరెస్టులు చేస్తావా? అని ప్రశ్నించారు.