అగ్గిపుల్ల…కుక్కపిల్ల….
బాలీవుడ్ పని అయిపోయిందంటూ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘పుష్ప’ సినిమా ఘన విజయం సాధించినప్పటి నుంచి బాలీవుడ్ పై సెటైర్లు వేస్తున్న వర్మ…’ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ చిత్రాలు హిట్ కావడంతో దూకుడు పెంచారు. దక్షిణాది చిత్రాలు ఘన విజయం సాధించడం, ఉత్తరాది చిత్రాలు డీలా పడటం చూస్తుంటే… కేవలం ఓటీటీల కోసమే బాలీవుడ్ సినిమాలను తెరకెక్కించే రోజులు వచ్చేలా ఉన్నాయంటూ వర్మ చేసిన తాజా కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ ని దక్షిణాది సినిమాలు డామినేట్ చేస్తున్నాయన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో వర్మ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. శివ, క్షణక్షణం, సత్య, అనగనగా ఒక రోజు, దెయ్యం వంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చచ్చిపోయాడని వర్మ అంటున్నారు. ప్రతి సినిమా తర్వాత తాను మారిపోతానని, మెదడులో తట్టిన ఆలోచనల్నే కథలుగా మలుస్తానని చెబుతున్నారు. ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన షోలో పాల్గొన్న వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా తనను చంపడానికి వస్తే తాను పారిపోనని, వచ్చిన వ్యక్తి తనను కత్తితో పొడిస్తే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానని వర్మ చేసిన తిక్క కామెంట్లు వైరల్ అయ్యాయి. రాజ్యాంగం తనకిచ్చిన హక్కులు వాడుకుంటానని, ఎదుటి వాళ్లు బాధపడతానుకుంటే అసలు ఏమీ మాట్లాడలేమని అన్నారు. టికెట్ల ధరల పెంపుపై కేవలం ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని అన్నారు. తన నిర్ణయం కొందరికి నచ్చుతుందని, ఇంకొందరికి నచ్చదని అన్నారు.
తాను ఎన్నికల్లో నిలబడినా బుద్ధి ఉన్నోళ్లెవరూ తనకు ఓటెయ్యరని, తాను జనాల కోసం ఏమీ చేయనన్న విషయం వారికి బాగా తెలుసని అన్నారు వర్మ. తన కోసం తాను బతుకుతున్నానని, రాజకీయ నాయకుల లక్షణం అది కాదని చెప్పారు. తనలాగా బతకాలంటే దేవుడు, సమాజం, కుటుంబం వంటి వాటిని వదిలేయాలని, అప్పుడు వచ్చే స్వేచ్ఛతో తన లాగా బతకవచ్చని వర్మ తెలిపారు.