టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును కటకటాల్లోకి నెట్టాలి. ఆయనను ఎలాగైనా.. సరే.. జైలుకు పంపించి.. ఒక మరక అంటించాలి. ఇదీ.. వైసీపీ వ్యూహం. ఇలా అనేకన్నా.. కూడా వైఎస్ కుటుంబానికి ఉన్న వ్యూహం అనడమే సముచితం. ఎందుకంటే.. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికూడా.. చంద్రబాబును ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలని ప్లాన్ చేశారు. దాదాపు 25 అంశాల్లో ఆయన కమిటీలువేసి.. ఎక్కడైనా లూప్ హోల్ లభించకపోతుందా.. చంద్రబాబును జైలుకు పంపించకపోతామా? అని ప్రయత్నించారు.. కానీ.. వైఎస్‌కు సాధ్యం కాలేదు.
ఇక, ఇప్పుడు ఆయన కుమారుడు, ఏపీ సీఎం జగన్ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ..చంద్రబాబుపై.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన కేసు నమోదు చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవినీతి, అక్రమాలు జరిగాయని… కొందరికే ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారని, పేదలకు అన్యాయం జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 27న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై సీఐడీ అధికారులు రెండు వారాల్లోనే విచారణ జరిపి అక్రమాలు జరిగాయని తేల్చేశారు. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబును ఏ1గా చేర్చుతూ… మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయం లో కేసు (16/2022) నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ఏ2గా చేర్చారు. ఇంకా… లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీపీ అంజనీ కుమార్(బాబీ), హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎల్ఈపీఎస్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఈపీఎల్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఆగ్రో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయనీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా చేర్చారు.
ఏప్రిల్ 27న ఎమ్మెల్యే ఆళ్ల చేసిన ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు చేశామని… అందులో నిజాలున్నట్లు ఈనెల 6న నిర్ధారించామని… అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ ఆదేశాల మేరకు సోమవారం (9వ తేదీ) కేసు నమోదు చేశామని దర్యాపు అధికారి. సీఐడీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు.
మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలపై కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120(బి), 420, 34, 35, 36, 37, 166, 167, 217 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(ఏ) కూడా చేర్చారు.
120(బి): నేరపూరిత కుట్ర.. గరిష్ఠంగా మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, రెండేళ్లు.. అంతకుమించి కఠిన కారాగార శిక్ష.. కనిష్ఠంగా ఆరు నెలల శిక్ష, జరిమానా విధించొచ్చు.
420: మోసం, నమ్మక ద్రోహం.. ఏడేళ్ల వరకూ శిక్ష, జరిమానా.
34: వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కుట్ర, నేరాలకు పాల్పడడం.. శిక్షతోపాటు జరిమానా.
35: ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం.. స్వార్థంతో నేరానికి పాల్పడడం..
36: న్యాయవిరుద్ధమైన చర్యలు
37: పాక్షికంగా నష్టం కలిగించడం, గాయపరచడం.
166: పబ్లిక్ సర్వెట్ చట్టాన్ని గౌరవించకపోవడం.
167: పబ్లిక్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం.. మూడేళ్ల వరకూ శిక్ష, జరిమానా.
217: చట్టవిరుద్ధంగా పబ్లిక్ సర్వెంట్ నిర్ణయాలు తీసుకోవడం.. రెండేళ్ల వరకూ శిక్ష
13(2): పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడడం.. ఏడేళ్ల వరకూ శిక్ష.
13(1)(ఏ): నేరపూరిత కుట్ర.. ఏడేళ్ల శిక్షతోపాటు జరిమానా. వంటి సెక్షన్లు విధించారు.
విషయం ఏంటంటే..
అమరావతితో కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానం చేస్తూ 2018లో సీఆర్డీఏ ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించింది. 8 వరుసల రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ పద్ధతిలో వెళ్లాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తం 16,556 ఎకరాల భూమి సేకరించి రెండు దశల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. అయితే రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కొందరి భూముల ధరల పెంపునకు కుట్ర దాగుందని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆరోపించింది.
దీనిపైనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో రాజకీయ నేతలు, భూ యజమానులు, సంస్థలు… మొత్తం 13 మందిని నిందితులను చేర్చింది. దీంతోపాటు ‘మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు’ ఉన్నట్లు తెలిపింది. ఆ ప్లాన్ రూపొందించిన అధికారి ఎవరు? దానికి ఆమోదం తెలిపిందెవరు? ఆ ప్లాన్‌లో సంతకాలు ఎవరు పెట్టారనే విషయాలను మాత్రం ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదు. అయితే.. ఇది నిలబడే కేసు కాదని. జగన్ ప్రయత్నాలు అభాసు పాలు కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.