ప్రపంచ కుబేరుడు మనసు పడి కొన్న ట్విటర్ కు తనదైన మార్పులు చేయాలని ఆయన పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థలో కీలక భూమిక పోషిస్తున్న మనోళ్లు ఇద్దరికి స్పాట్ పెట్టిన అతడు.. ట్విటర్ ను సమూలంగా మార్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న చర్చ ఏమంటే.. ట్విటర్ ను వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా దీనికి సంబంధించిన సమాధానం బయటకు వచ్చింది. ట్విటర్ లో త్వరలోనే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు చెబుతున్నారు.
అలా అని అందరి వద్దా కాదు కానీ..కొందరి వద్ద ఛార్జీలు వసూలు చేయటం ఖాయమంటున్నారు. సాధారణ యూజరర్ల వద్ద నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయమని ట్విటర్ వేదికగా చెప్పిన ఎలాన్.. వాణిజ్య ఖాతాదారులు.. ప్రభుత్వ వినియోగదారుల నుంచి స్వల్ప మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారని చెబుతున్నారు. అయితే.. అదెంతన్న విషయంపై మాత్రం ట్విటర్ స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. ట్విటర్ తన సొంతమైన తర్వాత చాలానే మార్పులు తేవాలన్న ఆలోచనలో ఎలాన్ మస్క్ ఉన్నట్లు చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో ట్విటర్ లో చాలా చాలా మార్పులు తేవాలన్న మాట ఎలాన్ మస్క్ నోటి నుంచి కూడానే వచ్చింది. ట్విటర్ కు కొత్త ఫీచర్లను తేవటంతో పాటు.. అల్గారిథమ్ ను ఓపెన్ సోర్సుగా మారుస్తామని చెబుతున్నారు. ఇక.. బ్లూ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పాలసీలోనూ మార్పులు తేవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తన హయాంలో ట్విటర్ ను మరింత స్వేచ్ఛగా.. ప్రపంచానికి మేలు జరిగేలా మార్పులు ఉంటాయన్న మాట చెబుతున్నప్పటికి.. ఇప్పటివరకు ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇస్తున్న అప్డేట్స్ ను చూస్తే.. దీన్నో బిజినెస్ ప్లాట్ ఫాంగా మార్చే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో ట్విటర్ లో బోలెడన్ని మార్పులు చోటు చేసుకుంటాయని మాత్రం చెప్పక తప్పదు.