అమెరికాలో ఉండే వేలాది మంది వలసదారులకు తాజాగా స్వీట్ న్యూస్ చెప్పింది బైడెన్ సర్కార్. ఈ వలసదారుల్లో మన దేశానికి చెందిన వారు కూడా భారీగా ఉన్నారు. వర్క్ పర్మిట్ వీసా గడువు ముగుస్తున్న కొన్ని కేటగిరీలక వారికి మరో 18 నెలల పాటు గడువు పొడిగిస్తున్నట్లుగా చేసిన ప్రకటన సంతోషాన్ని కలిగించటం ఖాయమంటున్నారు.
ఇందులో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు.. హెచ్ 1బీ వీసాదారులు ఉన్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మే 4 (ఈ రోజు నుంచే) అమల్లోకి రానున్నట్లుగా ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డు గడువు తీరిన తర్వాత 180 రోజుల వరకు వాడుకునే వీలుంది.
ఇప్పుడు దాన్ని 540 రోజుల పాటు ఆటోమేటిక్ గా పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో వర్కు పర్మిట్ లో ఉన్న వారు మరికొంతకాలం తాము చేస్తున్న ఉద్యోగాల్ని కొనసాగించే వీలు కలుగుతుంది.
ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగుల కొరత కొంత తగ్గుతుందని చెబుతున్నా.. దానికి మించి వలసదారుల కుటుంబాలకు ఆర్థికంగా సహకారం లభిస్తుందన్న మాటలో వాస్తవం ఉందని చెబుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో దాదాపు 87 వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరటంతో పాటు దాదాపు 4.2 లక్షల మంది వలసదారులకు పని పోకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా లాభం పొందిన వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉంటారని చెబుతున్నారు. ఏమైనా.. తాజా నిర్ణయం భారత వలసదారులకు మేలు చేస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.