ప్రభుత్వానికి నీటి పన్ను కట్టండి అంటూ రైతులకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం. కట్టక పోతే రైతు భరోసా రాదు,పంట నష్ట పరిహారం రాదు అంటున్న సచివాలయం సిబ్బంది. ఇది ఏపీలో పరిస్థితి.
దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిబిఐ దత్త పుత్రుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నారా అని ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు పవన్.
అసలే ప్రభుత్వ వైఫల్యం కరెంటు కోతల వల్ల రైతులు తీవ్రంగా నస్టపోయి, గిట్టు బాటు ధరలు దక్కక అప్పుల పాలై ఉంటే… బలవంతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘నీటి తీరువ’ వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నారంటే.. వడ్డీ వ్యాపారం కంటే దారుణంగా జగన్ పరిపాలన ఉందని పవన్ విమర్శించారు.
నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధానమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పల్లెకి టార్గెట్ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేయడం దారుణం అన్నారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారంటే దోపిడీ ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు.
2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం ఎంత దారుణం… ఇంతకన్నా దోపిడీ ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు పవన్.
గత నెల ఆస్తిపన్ను చెల్లించలేదని ఇళ్లకు తాళాలు వేశారు.
చెత్త పన్ను కట్టలేదని చెత్త తెచ్చి ఇంటి ముందు పోశారు.
ఆస్పత్రుల్లో అంబులెన్స్ దొరక్క బండిమీద శవాన్ని వేసుకుని తండ్రి వంద కిలోమీటర్లు వెళ్లేలా అరాచకం చూపించారు.
రూయా ఆస్పత్రి ప్రభుత్వానిదా? వైసీపీదా? ఆస్పత్రిలో సైకిల్ పార్కింగ్ నుండి ప్రతి టెండర్ వైసీపీ నాయకులదే అని పవన్ ధ్వజమెత్తారు.