సన్యసించిన స్వామీజీకి
పుట్టిన రోజు వేడుకలా?
అసలు దేవుళ్లను మరచిపోవాలి..
ఆయన సేవలో రాష్ట్రంలోని
దేవాలయాలన్నీ తరించిపోవాలి
శారదాపీఠానికి వెళ్లి మరీ..
స్వరూపానందకు ఆలయ మర్యాదలు
దేవుళ్ల ఆశీస్సులూ అందించాలి
‘ప్రభుత్వ’ స్వామి కోరగానే
జగన్ సర్కారు ఆదేశాలు
హైకోర్టు ఆగ్రహంతో వెనక్కితగ్గిన వైనం
శ్రీరామచంద్రుడి పుట్టిన రోజు చైత్ర శుద్ధ నవమి. ప్రతి ఏటా రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడు భాద్రపద బహుళ అష్టమి నాడు జన్మించారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి జరుపుతుంటారు. పరమపదించిన, సిద్ధసమాధి పొందిన గురుదేవులకు ఆయా రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రపంచప్రఖ్యాత కంచి, శృంగేరి, ద్వారక, పూరి శంకరాచార్యలు పుట్టినరోజు వేడుకలు జరిపినట్లు మనకు తెలియదు. ఒకవేళ జరుపుకొన్నా.. అవి ఆయా పీఠాలకే పరిమితం. ఆయా పీఠాలున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, దేవాలయాలు.. వారికి ప్రభుత్వ, ఆలయ లాంఛనాలతో జన్మదిన వేడుకలు ఎప్పుడూ జరపలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తద్భిన్నంగా.. అధికార పక్షానికి అనుకూలంగా ఉన్న స్వయంప్రకటిత విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ వారి జన్మదిన వేడుకలను నవంబరు 18న ఘనంగా నిర్వహించాలని.. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అధికారులంతా విశాఖకు తరలివెళ్లి.. ఆయనకు ఆలయ మర్యాదలు జరిపి… దేవుళ్ల ఆశీస్సులు అందించాలని దేవదాయ శాఖ 24 ప్రసిద్ధ దేవాలయాల అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై హైకోర్టు మండిపడడంతో దేవదాయ శాఖ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
సాధారణంగా ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు, పండుగ రోజుల్లో భవదనుగ్రహం కోసం అందుబాటులో ఉన్న గుళ్లకు వెళ్లి పూజలుచేయడం రివాజు. అంతేకానీ, అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఉన్న ప్రముఖ దేవాలయాల్లోని వేదపండితులు, పూజారులు, అధికారులు వారి దేవుళ్లను వదిలేసి ఆలయ మర్యాదలతో సహా మనకు ఆశీర్వచనాలు ఇచ్చేందుకు మనింటి ముందు బారులు తీరడం సాధ్యమా? సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అసలు ఇలాంటి ఊహే ఇప్పటి వరకు ఎవరికీ వచ్చి ఉండదు. ఇలాంటి అసాధారణ మర్యాద రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రీకీ, గవర్నర్‌కి జరగలేదు. కానీ విశాఖలోని శారదాపీఠం పేరిట ఉన్న ఒక ప్రైవేటు పీఠం అధిపతి స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలను రాష్ట్రంలో 23 ఆలయాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆ దేవాలయాలను ఆదేశించింది. ఆ పీఠం నిర్వాహకుడొకరు ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వం దాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని 23 దేవాలయాలకు చకచకా ఆదేశాలు జారీ చేయడం జరిగిపోయాయి. ఆ రోజున ఆ దేవాలయాల నుంచి వేదపండితులు, పూజారులు, అధికారులు వారి వారి గుళ్లలోని ప్రసాదాలు, ఆలయ మర్యాదల ప్రకారం కానుకలతో విశాఖ వెళ్లి స్వరూపానందను ఆశీర్వదించి, తీసుకెళ్లినవి సమర్పించి రావాలని నిర్దేశించారు. అంటే ఆ ఒక్క రోజూ వారంతా తమ తమ దేవాలయాల్లోని దేవుళ్లను మర్చిపోయి ఈ స్వామి సేవలో తరించాలని ఆదేశించిందన్న మాట. ఈయన సీఎం జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే ఇలాంటి ఆదేశాల జారీకి కారణమైంది.
ప్రైవేటు స్వామి తీరే వేరు..
సాధారణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు.. ప్రముఖ దేవాలయమైన తిరుమల నుంచి వేద పండితులు వచ్చి ఈ ప్రముఖులకు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేస్తారు. కానీ దేవాలయాల్లో మర్యాదల విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ శారదాపీఠం స్వామికి జరుగుతున్న మర్యాదలే వేరు. కొద్దిరోజుల క్రితం ఆయన తిరుమలకు వస్తున్నారని తెలిసి.. ఆలయ ఉన్నతాధికారులు, అర్చకులు చైర్మన్‌తో సహా కొండ నుంచి దిగివచ్చి.. మేళతాళాలతో అలిపిరి గేటు వద్దకు ఆయనకు ఎదురేగి మరీ స్వాగతం పలికి దైవదర్శనానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత మరోసారి వస్తున్నారని తెలిసి ఈ సారి ఏకంగా ఎయిర్‌పోర్టు వద్దకే వెళ్లి తిరుమల కొండకు తోడ్కోని వెళ్లారు.
తిరుమల ఆలయ మర్యాదల ప్రకారం ఒక ప్రైవేటు పీఠాధిపతికి ఇలాంటి మర్యాదలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ గమ శాస్త్రానికి సంబంధించి ఏ మైనా సలహాలు తీసుకోవాల్సి ఉంటే కంచి, శృంగేరి పీఠాధిపతులను అధికారికంగా సంప్రదిస్తారు. అలాంటి వారు తిరుమలకు, ఇతర దేవాలయాలకు దర్శనాలకు వచ్చినా ఇలా ఎదురెళ్లి స్వాగతాలు పలికి తీసుకొచ్చే సంప్రదాయం లేదు. వారంతట వారే వచ్చి తిరుమలేశుడిని దర్శించుకుంటారు. గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర స్వరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష కోసం విజయవాడలో 2 నెలల పాటు ఉంటే ఒక్క ఆలయ అధికారులు కూడా మర్యాదగా దర్శించుకోలేదు. సతాతనసర్వజ్ఞ జగద్గురు కంచి పీఠాధిపతులనే పట్టించుకోని దేవదాయ శాఖ.. స్వయంప్రకటిత విశాఖ పీఠాధిపతికి మాత్రం ఊడిగం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచంపై విరక్తితో.. కోరికలను జయించి సన్యసించిన స్వామివారు.. ఏటా చాతుర్మాస దీక్ష చేపడుతుంటారు. అలాంటి వ్యక్తికి పుట్టిన రోజు జరుపుకోవాలని బుద్ధిపుట్టడమే విస్మయం కలిగించే అంశం అయితే.. ఆయన కోరిందే తడవుగా సర్కారు వారి భృత్యులు ఆదేశాలివ్వడం మరీ విచిత్రం. ఏ ఆలయం తనకు మర్యాద చేయాలో.. కానుకలివ్వాలో సదరు పీఠాధిపతి ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించారు కూడా. శ్రీకాకుళంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం (అరసవిల్లి), విజయనగరం శ్రీ పైడితల్లి దేవస్థానం, రామతీర్థం దేవాలయం, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం(సింహాచలం), విశాఖ శ్రీ కనకమహాలక్ష్మీ దేవస్థానం, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ద్వారకాతిరుమల, భీమవరం శ్రీ మావూళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి దేవస్థానం, కోటప్పకొండ, త్రిపురాంతకం, నెల్లూరు శ్రీ రంగనాథస్వామి వారి దేవస్థానం, శ్రీ కాళహస్తి, కాణిపాకం, కడప జిల్లా గండి ఆంజనేయస్వామి, దేముని కడప వేంకటేశ్వరస్వామి దేవస్థానం, శ్రీశైలం, మహానంది, అహోబిలం దేవస్థానాలు, అనంతపురంలోని కాసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం.
మఠాధిపతికి ఆలయ మర్యాదలా: హైకోర్టు ఆగ్రహం
స్వరూపానంద జన్మదినాన ఆలయ మర్యాదలను పాటించాలని రాష్ట్ర దేవదాయశాఖ జారీ చేసిన మెమోను హైకోర్టు తప్పుబట్టింది. మఠాధిపతికి ఆలయ మర్యాదలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. మత సంబంధ విషయాల్లో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని నిలదీసింది. వేరే మతాలకు చెందిన వారు ఇలాంటి విజ్ఞప్తితోనే ముందుకొస్తే ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా అని ప్రశ్నించింది. దేవదాయశాఖ తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. దీనిపై దేవదాయ అదనపు కమిషనర్ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తామని తేల్చిచెప్పింది. దీంతో ఆలయ మర్యాదల వినతి లేఖను ఉపసంహరించుకుంటామని శారదా పీఠం మేనేజర్ తరఫున సీనియర్ న్యాయవాది విన్నవించారు. ఇందుకు కోర్టు అనుమతించింది. పీఠం తన వినతి లేఖను వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్ జారీ చేసిన మెమో ప్రభావం కోల్పోతుందని స్పష్టం చేసింది. దీంతో నవంబరు 17న దేవదాయ శాక తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దరిమిలా.. ప్రతి ఏటా సాధారణంగా దక్కే మర్యాదలు కూడా స్వరూపానందకు లేకుండా పోయాయి. చివరకు పీఠం దగ్గర్లోని సింహాచలం దేవస్థానం నుంచి కూడా అధికారులు, అర్చకులు అక్కడకు వెళ్లకపోవడం గమనార్హం.
వితండవాదన..
మఠాధిపతులను గౌరవించాలని దేవదాయశాఖ చట్టంలోనే ఉందని శారదా పీఠానికి చెందినవారు వాదిస్తున్నారు. అయితే ఆ చట్టంలో మఠాధిపతులు, స్వామీజీలను గౌరవించాలని ఉంది తప్ప వారి వద్దకు వెళ్లి మర్యాదలు చేయాలని ఎక్కడా లేదు. దేవదాయశాఖ ఉద్దేశంలో గౌరవించడం అంటే ఆలయానికి వచ్చినప్పుడు పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామివారికి వద్ద పూజలు చేసి, శేషవస్త్రం సమర్పించడం లాంటివి మాత్రమే ఉంటాయి. లేదంటే పీఠాధిపతులు వారి ఆశ్రమాల్లో వేద సభగానీ, యాగాలుగానీ నిర్వహిస్తే దానికి ఆలయాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే సంప్రదాయం ఉంది. కానీ ఒక మఠాఽధిపతి పుట్టినరోజు సందర్భంగా మర్యాదలు చేయడం ఇంతవరకూ ఎక్కడా లేదు. ఇలాంటి మర్యాదల సంప్రదాయం మొదలుపెడితే భవిష్యతలో మఠాధిపతులు, స్వామీజీలు ఇదే తరహా మర్యాదలు కోరే అవకాశం ఉందని, అప్పుడు దేవదాయశాఖ ఏ కారణంతో తిరస్కరించాలో కూడా స్పష్టత లేదని దేవదాయశాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్వామీజీ అయినా దేవుడి దగ్గరకు రావాలి తప్ప, తన వద్దకే ఆలయ మర్యాదలు రావాలని కోరుకోవడం హైందవ సంస్కృతికి కూడా విరుద్ధంగా ఉందని సనాతన సంప్రదాయవాదులు అంటున్నారు.