సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ ఆర్థిక స్థితి గాడి తప్పిన సంగతి తెలిసిందే. తన మాట కోసం జగన్ ఖజానాలోని డబ్బులను పప్పు, బెల్లాల మాదిరిగా పథకాలకు పంచిపెడుతున్న వైనంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా పంచిపెట్టడం వల్ల ఆఖరికి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే జగనన్న ఒక శాఖలోని నిధులను మరో శాఖకు మళ్లించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఏపీలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) కింద కేటాయించిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించి పీడీ ఖాతాలకు సదరు నిధులను మళ్లించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ నిధుల వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు…ఏపీ సర్కార్ కు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధుల మళ్లింపును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ సుప్రీం కోర్టుకు ఆ శాఖ తెలిపింది. దీంతో, ఆ స్పందనను కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు…ఏపీ సర్కారు తీరును తప్పుబట్టింది. ఎన్డీఆర్ఎఫ్ నిధులను దారి మళ్లించడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆ నిధులు మళ్లిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపివేస్తూ..ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
ఇలా నిధుల మళ్లింపునకు ఏపీ ప్రభుత్వం పాల్పడినట్లు కాగ్ నిర్ధారించిందని కేంద్రం గతంలోనే తెలిపింది. రూ.1,100 కోట్ల విపత్తు నిధులను ఏపీ సర్కార్…రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించిందని వెల్లడించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు దాన్ని మళ్లించారని,కానీ, పంట నష్టపోయిన రైతులకు మాత్రం ఆ నిధులు అందించలేదని తెలుస్తోంది. పార్లమెంట్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ ప్రశ్నకు గతంలో కేంద్ర మంత్రి ఆ రకంగా సమాధానమిచ్చారు.