ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ షాకింగ్ కామెంట్లు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓ కూటమిగా ఏర్పడదామని మాయావతికి సూచించామని, మాయావతే సీఎం అభ్యర్థి అని కూడా స్పష్టంగా చెప్పామని అన్నారు.
కానీ, తమ ఆఫర్ పై మాయావతి కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, స్పందించలేదని రాహుల్ ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణల ఒత్తిడి వల్లే ఆమె వెనుకంజ వేసి ఉంటుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల్లో మాయావతి ఏమాత్రం పోరాడలేదని, దళితుల గొంతుక బలంగా వినిపించేందుకు కాన్షీరాం వంటివారు ఎంతగానో కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ఓటమి వేరే విషయమని, కానీ, దళితుల కోసం మాయావతి ఈ సారి పోరాడలేదని అని విమర్శించారు.
ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై బెహెన్ జీ మాయావతి స్పందించారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక బీఎస్పీపై విమర్శలు చేస్తున్నారంటూ రాహుల్ పై మాయావతి విమర్శలు గుప్పించారు. రాహుల్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఇలాంటి చిన్న విషయాలను వదిలేసి యూపీలో ఓటమికి గల కారణాలపై దృష్టి పెడితే బాగుంటుందని రాహుల్ కు హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాంగ్రెస్ పార్టీ ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవాలని, బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకోలేక, ఇలా రాళ్లు విసురుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా, చేసిందేమీ లేదని ఘాటుగా స్పందించారు. మరి, ఈ కామెంట్లపై రాహుల్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.