ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు ఈ – మెయిల్ రావడం దేశవ్యాప్తంగా పెను కలకలం రేపింది. వీలైనంత త్వరగా మోదీని హత్య చేస్తానని ఆ ఆగంతకుడు ఈ-మెయిల్ లో ప్రకటించాడు. అంతేకాదు, దేశంలో మారణహోమం సృష్టించి వేలాదిమందిని పొట్టనబెట్టుకునేందుకు తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉందని కూడా ఆగంతుకుడు ఆ ఈ – మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఏ ముంబై శాఖకు ఈ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశంలో 20 బాంబు దాడులు ప్లాన్ చేసినట్లుగా ఆ ఆగంతకుడు హెచ్చరించాడని తెలుస్తోంది.
దేశంలో ఈ తరహా విధ్వంసం చేయగల వ్యక్తులతో తాను టచ్‌లో ఉన్నానని, ఫిబ్రవరి 28న స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేశానని కూడా అతడు చెప్పడం కలకలం రేపింది. ఇక, ఆర్డీఎక్స్ దాడులకు సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు తనకు సహకరిస్తున్నట్లు కూడా ఆ ఆగంతకుడు వెల్లడించాడు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ప్రధాని మోదీకి బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టడటంతోపాటు ప్రధాని మోదీ భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఆ మెయిల్ ను ఎన్ఐఏ మిగతా దర్యాప్తు సంస్థలకు కూడా పంపింది. ఆ ఈ – మెయిల్ పూర్వాపరాలు, ఐపీ అడ్రస్ తదితర వివరాలు తెలుసుకునేందుకు సైబర్ సెక్యురిటీ ఏజెన్సీ అధికారులు విచారణ జరుపుతున్నారు.