ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, బీజేపీ నేతలకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించగా…బీజేపీ బొక్కబోర్లా పడింది. దీంతో, కేజ్రీవాల్ పై రగిలిపోతున్న బీజేపీ నేతలు కుట్రలకు తెరతీశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ యువజన విభాగం (బీజేవైఎం) శ్రేణులు దాడికి దిగిన ఘటన కలకం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ దాడికి పాల్పడ్డ 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయని, సీఎం ఇంటి చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఈ కేసులో పాల్గొన్న మరికొంత మంది బీజేపీ కార్యకర్తల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు.
సుమారు 200 మందిదాకా బీజేవైఎం కార్యకర్తలు కేజ్రీ ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం సంచలనం రేపింది. సీఎం ఇంటి ముందు ఏర్పాటు చేసిన బారీకేడ్లు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన వారు…కేజ్రీవాల్ ఇంటి గోడపై కాషాయ రంగును చల్లారు. బీజేవైఎం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో ఈ దాడి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై కేజ్రీ చేసిన కామెంట్లకు నిరసనగానే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.
ఈ దాడిపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేని బీజేపీ ఇలా తమ కార్యకర్తలతో దాడులకు పాల్పడుతోందని ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నిప్పులు చెరిగారు. కేజ్రీ ఇంటిపై బీజేవైఎం శ్రేణుల దాడి దృశ్యాలను ట్విటర్ లో పోస్ట్ చేసిన సిసోడియా…కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోపించారు.
ఇక, కశ్మీరీ పండిట్ల ఊచకోత అబద్ధమని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నేతృత్వంలోని కార్యకర్తల బృందం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని యువమోర్చా డిమాండ్ చేసింది. వారు క్షమాపణ చెప్పే వరకు యువమోర్చా నిరసనలు కొనసాగిస్తామని తేజస్వి చెబుతున్నారు.