త్వరలోనే టీడీపీ 40 ఏళ్ల వసంతాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయి లో .. ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ 40 ఏళ్ల వేడుకల సాక్షిగా.. గట్టి సంకల్పం కోసం.. తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేస్తే.. అధికారం దక్కించుకోలేని పార్టీ అనే అపవాదు.. ఉందని.. దీనిని తుడిపేయాలని.. చాలా మంది యువ నాయకులు కోరుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు పొత్తుల కోసం ఉవ్విళ్లూరుతున్న పార్టీలకు.. క్షేత్రస్థాయి లో టీడీపీని మించిన బలం లేదని కూడా చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఉన్న బలం అంచనా వేసి.. ఈ 40 ఏళ్ల వేడుకల వేదికగా.. గట్టి సంకల్పానికి చంద్రబాబు ముందుకు రావాలని.. నాయకులు కోరుతున్నారు. యువత భారీ సంఖ్యలో ఉన్నారు. నడిపించే నాయకులు ఉన్నారు. జెండా మోసే కార్యకర్తలు ఉన్నారు.
సంస్థాగతంగా బలమైన కేడర్ పార్టీకి సొంతం. కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితిలో పొత్తుల జోలికి వెళ్లకుండా.. పార్టీని ఒంటరిగా నే అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేయాలని యువతరమే కొరుతుండడం గమనార్హం.
దీనికి గాను వారు చెబుతున్న ఫార్ములా ఏంటంటే.. 100 స్థానాల్లో పక్కాగా విజయం సాధించే దిశగా కార్యాచరణ రూపొందిస్తే.. చాలని! ప్రస్తుతం ప్రారంభం అవుతున్న 40 వసంతాల వేడుకలో.. ఈ సంకల్పం కోసమే.. గట్టిగా ప్రతిజ్ఞ చేయాలని తమ్ముళ్లు సూచిస్తున్నారు.
ఖచ్చితంగా గెలుస్తాము అనే 125 నియోజకవ ర్గాలను ఎంచుకుని.. అక్కడ బలంగా పనిచేయడం.. ఒకటికి పదిసార్లు ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేయడం.. నాయకులను యాక్టివేట్ చేసుకోవడం.. ముఖ్యమని సూచిస్తున్నారు.
ఈ 125 నియోజక వర్గాల్లో 110 స్థానాలు గెలిచేలా వ్యూహం పన్నితే సరిపోతుందని తమ్ముళ్లు అంటున్నారు. ఒకవేళ.. 110 కాకపోయిన.. 100 స్థానాల్లో విజయం ఖచ్చితంగా వస్తుందని వారు చెబుతున్నారు. అప్పుడు. అధికారంలోకి వచ్చే మెజారిటీ సొంతంగానే దక్కుతుందని.. అంటున్నారు.
ఈ గట్టి సంకల్పానికి.. యువ తకు ప్రాధాన్యం ఇచ్చేందుకు 40 వసంతాల వేడుకల వేదికలు.. ముఖ్యపాత్ర పోషించాలని అంటున్నారు. తద్వారా.. పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా.. పార్టీపై ఉన్న అపవాదును సైతం తుడిచి పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఏంటో చూడాలి.