మిత్రపక్షాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరీ ఇంత డార్క్ లో ఉన్నారా ? తాజాగా రెండు పార్టీల మధ్య ముదురుతున్న రోడ్ మ్యాప్ వివాదం చూస్తే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నట్లు పవన్ మొన్నటి ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఇదే విషయమై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ తమకు హోంశాఖ మంత్రి అమిత్ షో రెండు నెలల క్రితమే రోడ్ మ్యాప్ ఇచ్చేశారని చెప్పారు. తిరుపతిలో జరిగిన సభలో అమిత్ షా రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏ మ్యాపు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ఇక్కడే అందరికీ పవన్ వ్యవహారంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అమిత్ షా రోడ్ మ్యాపిచ్చి చాలా కాలమే అయితే ఆ విషయం పవన్ కు ఎందుకు తెలియలేదు ?
అమిత్ షా ఇచ్చిన రోడ్ మ్యాప్ ను పవన్ తో కమలనాథులు షేర్ చేసుకోలేదా ? అన్న విషయమై అనుమానాలు పెరిగిపోతున్నాయి. మిత్రపక్షం అధినేతకు తెలీకుండా బీజేపీ నేతలు ఎందుకని జాగ్రత్తలు తీసుకున్నారో తెలీటం లేదు. రోడ్ మ్యాపంటే రెండు పార్టీల మధ్య షేర్ చేసుకోకవాల్సిన వివరాలే కదా. ఇందులో దాపరికం కూడా ఏమీ ఉండదు. మరలాంటి రోడ్ మ్యాప్ గురించే పవన్ కు తెలియదంటే ఇక అవేమి మిత్రపక్షాలు ?
ఇలాంటి కారణాల వల్లే రెండు పార్టీలు ఎక్కువ కాలం మిత్రపక్షాలుగా ఉండవనే ప్రచారం పెరిగిపోతోంది. మీడియా సమావేశాలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న నిరసనలు కానీ రెండు పార్టీలు వేటికవే విడివిడిగా చేసుకుంటున్నాయి. జిల్లాల్లో సమావేశాలు పెట్టినా, బహిరంగ సభలు నిర్వహించినా రెండో పార్టీ నేతలు కనబడటం లేదు. మొన్నటి జనసేన ఆవిర్భావ సభకు పవన్ బీజేపీ నేతలను పిలవనే లేదు. కాబట్టి అతుకుల బొంత లాంటి సంబంధాలు ఎంతోకాలం నిలబడవన్న విషయం అందరికీ తెలుసు. మొత్తానికి పవన్నయితే బీజేపీ డార్క్ లో పెట్టేస్తోందన్న విషయం అర్థమవుతోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో ?