దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పారు.. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం దీపం ఆరిపోయాక ఇల్లు చక్కబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని తెలిసినప్పటికీ అయిదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమిపై ఇప్పుడు దృష్టి సారించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పుడు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా ఒక్కో రాష్ట్రంలో పరిస్థితులను విశ్లేషించాల్సిన బాధ్యతను ఒక్కో సీనియర్ నాయకుడిగా ఆమె కట్టబెట్టారు. ఈ పరుగులేదో ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసే దిశగా.. అంతర్గత విభేదాలు పరిష్కరించేందుకు వేస్తే బాగుండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఓటములతో..
ఎన్నికలు ఏవైనా సరే.. గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయని కాంగ్రెస్.. ఓడిపోయిన తర్వాత మాత్రం పరిస్థితి సమీక్షించేందుకు సిద్ధంగా ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏమైనా అంటే ఓటమికి బాధ్యతగా పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు గాంధీ కుటుంబ సభ్యులు ముందుకు రావడం.. వాళ్లను సీనియర్ నేతలు వారించడం జరుగుతూనే ఉంది. ఏడేళ్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. నాయకత్వ లేమితో పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నా.. గాంధీ కుటంబమే పార్టీని పాలించాలంటూ ఆ పార్టీ రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేయడం గమనార్హం.
ఇప్పటికైనా..
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కు దారుణమైన ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా పంజాబ్లో అధికారంలో ఉండి కూడా గెలవలేకపోయింది. అక్కడి నేతల మధ్య విభేదాలను పరిష్కరించలేక తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై జీ-23గా పిలిచే సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సంస్థాగత మార్పునకు సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు సోనియా సిద్ధమయ్యారు.
ఒక్కో రాష్ట్రంలో తాజా పరిస్థితులు విశ్లేషించి, పార్టీ విభాగాల్లో సంస్థాగత మార్పులను సూచించే బాధ్యతను ఒక్కో సీనియర్ నేతకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లో జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్లో అవినాశ్ పాండే, పంజాబ్లో అజయ్ మాకెన్, గోవాలో రజనీ పాటిల్, మణిపూర్లో జైరాం రమేశ్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పార్టీ తరపున ఇటీవల ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు, కీలక నేతలతో మాట్లాడి సోనియాకు వాళ్లు నివేదిక అందిస్తారు. దీని ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది సోనియా నిర్ణయిస్తారు.