ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో జగన్ మాట్లాడుతున్న మాటలకు ఏ మాత్రం పొంతన లేదన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తమ ఎంపీ అభ్యర్థులు 25 మందిని గెలిపిస్తే పార్లమెంటుకు వెళ్లి మోడీ మెడలు వంచుతామని, ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేరుస్తామని జగన్ మైకులు, స్పీకర్లు పగిలిపోయేలా హామీలు గుప్పించారు.
జగన్ ను నమ్మిన జనం…నిజంగా అలాగే జరుగుతుంది కాబోలు అంటూ వైసీపీకి పట్టం కట్టి 23 మంది ఎంపీలకు కట్టగట్టి మరీ పార్లమెంటుకు పంపించారు. ఇది జరిగి రెండున్నరేళ్లయినా సరే…వైసీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లడం…రావడం తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. ఇక, హోదా సంగతి ఊసే లేదు. జనం అడుగుతారేమో అన్న ఒకే ఒక్క కారణంతో…అడపాదడపా…మాకు హోదా కావాలంటూ ఎంపీలు షో చేయడం మినహా…గట్టిగా హోదా కోసం మోడీని నిలదీసిన దాఖలాలు లేవు. అదేమంటే, కేంద్రంలో బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువుందని, కాబట్టి 2024 వరకు మోడీని హోదా గురించి గట్టిగా నిలదీసి అడగడం కుదరదని జగన్ ఒక్క ముక్కలో తేల్చేశారు.
ఇక, తాజాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రంలో మోడీ సర్కార్ బలం మరింత పెరిగింది. దీంతో, హోదా విషయం అటకెక్కినట్లేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు విమర్శలు గుప్పించారు. తాజా ఫలితాలతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఇకపై కేంద్రాన్ని చూసి ఆయన మరింత భయపడతారని రామ్మోహన్ నాయుడు చురకలంటించారు.
మోడీకి జగన్ దాసోహం అయిన ఫలితంగా రాష్ట్రానికి మరింత అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలతో బీజేపీ మరింత బలంగా మారిందని, రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధుల గురించి ఇకపై కేంద్రాన్ని అడగలేని బలహీన పరిస్థితిలోకి జగన్ వెళ్లిపోతారని అన్నారు. పార్లమెంటులో తమ బలం తక్కువగా ఉన్నా…రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తుండడం వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడడం లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలహీనపడుతున్నాయన్న వాదనను కొట్టిపారేశారు. ‘పాంచ్ పటాకా’తో జగన్ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని రామ్మోహన్ నాయుడు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.