కమెడియన్ అని చాలా సింఫుల్ గా తేల్చేస్తారు. కానీ.. అన్ని రసాల్లోకెల్లా హస్యరసాన్ని పండించటం చాలా కష్టం. కానీ.. ఆ శ్రమకు దక్కే గుర్తింపు చాలా తక్కువ. ఇక.. కమెడియన్ గా ఉన్న వారిని సీరియస్ పదవులు దక్కటం చాలా అరుదు. అయితే.. తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు భగవంత్ మాన్.
ఇప్పటివరకు కమెడియన్ గా గుర్తింపు ఉన్న ఆయన.. ఈ రోజు నుంచి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రత్యేక గుర్తింపును పొందనున్నారు. జనాల్ని నవ్వించటమే కాదు.. అవసరమైనప్పుడు ప్రజల కన్నీళ్లు తుడవాలని తండ్రి చెప్పిన మాటకు కట్టుబడే రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు చెప్పే భగవంత్ మాన్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలవనున్నారు.
పంజాబ్ కంచుకోటను ఆప్ బద్ధలు కొట్టటం..స్టీరియో ఫోనిక్ రాజకీయాలకు చెల్లు చీటి ఇచ్చేలా పంజాబ్ ప్రజల్ని కార్మోన్యుఖుల్ని చేయటంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఒకప్పుడు జనం నన్ను చూసి తెగ నవ్వేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అందరూ రోదిస్తున్నారు.. తమను కాపాడమని కోరుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపికైన వేళలో మాన్ చేసిన వ్యాఖ్యలు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అప్పటివరకు హస్యాన్ని పండించే ఆయన నోటి నుంచి ఈ వ్యాఖ్య వచ్చిన నాటి నుంచి ఆయనలో నవ్వు మాయమై.. పొలిటికల్ సీరియస్ నెస్ ఎక్కువైందని చెప్పాలి. ఇంతకీ భగవంత్ మాన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన సాదాసీదా జీవితాన్ని షురూ చేసి.. పంజాబ్ లాంటి కీలక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఎలా సాధ్యమైందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి.
దగ్గర దగ్గర యాభై ఏళ్ల వయసున్న భగవంత్ సింగ్ మాన్ 1973 అక్టోబరు 17న జన్మించారు.సంగ్రూర్ లోని ఒక జాట్ సిక్కు ఫ్యామిలీలో పుట్టిన అతడి తల్లిదండ్రులు సాదాసీదా రైతులు. కాలేజీ రోజుల్లో కామెడీ షోలతో గుర్తింపు పొందిన అతను నటన మీద ఉన్న ఆసక్తితో డిగ్రీని పూర్తి చేయలేకపోయాడు. అనంతరం ఇందర్ ప్రీత్ కౌర్ ను పెళ్లి చేసుకున్నారు కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంటే 2015లో ఆయన విడాకులు తీసుకున్నారు. పిల్లలు ఇద్దరు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు.
కామెడియన్ గా సుపరిచితులైన అతను రాజకీయ నేతలపై సెటైర్లు వేస్తూ తన కార్యక్రమాల్ని రక్తి కట్టించేవారు 2008లో గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్ అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ‘మైనే మా పంజాబ్ దీ’ సినిమాలో అతడి నటన అద్భుతంగా చెబుతారు. 2011లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అతడు 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి సంగ్రూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019లోనూ అదే స్థానం నుంచి ఎంపీగా మరోసారి విజయం సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి రథసారధిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకోవటంతో భగవంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి కానున్నారు.
మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కేజ్రీవాల్ పంజాబ్ ప్రజలకు ఒక ఆసక్తికర పోటీని ముందుంచారు. రాష్ట్ర ప్రజలు తమకు నచ్చిన ముఖ్యమంత్రిని ఎన్నుకోవచ్చంటూ.. తమ పార్టీ అభ్యర్థుల్లో సీఎం పదవికి పోటీ పడే వారి పేర్లను ప్రకటించి.. వారిలో తమకు నచ్చిన వారికి ఓట్లు వేయాలని కోరారు. ఆ పోటీలో భగవంత్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పంజాబ్ కు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య.. నిరుద్యోగం. అందుకే.. తాను అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటం మీదనే ఫోకస్ అని ప్రకటించారు. మరేం చేస్తారో చూడాలి.
ఇక.. భగవంత్ మీద ఆరోపణలు.. విమర్శలు కూడా ఎక్కువే. అతను పచ్చి తాగుబోతు అని.. డ్రగ్స్ కూడా వాడతారని చెబుతారు. నిత్యం అతను మద్యం మత్తులో ఉంటారని.. అలాంటి వ్యక్తిని సీఎంను చేస్తే.. పంజాబ్ మొత్తాన్ని మత్తులో ముంచేస్తాడని అతడి ప్రత్యర్థులు అతనిపై భారీ ఎత్తున విమర్శలు.. ఆరోపణలు చేసినా ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం భగవంత్ మీద తమకున్న సంపూర్ణ నమ్మకాన్ని ప్రదర్శించారు.
నిజానికి భగవంత్ మద్యం సేవించి పార్లమెంటుకు వెళతారని.. ఆయన దగ్గరకు వెళితే చాలు.. మద్యం వాసన గుప్పుమంటుందన్న మాటలు కూడా కొందరు ఎంపీలు చెప్పటమే కాదు.. స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ర్యాలీలో ప్రజలందరి మధ్యన తాను మద్యం జోలికి వెళ్లనని ఒట్టు వేశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా బాధ్యతగా మసులుకుంటానని ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా చెప్పేవారు. మరి భగవంత్ ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరిస్తారన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదేమో?