దక్షిణాదిలో సినీ, రాజకీయ రంగాలకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజ నటులు రాజకీయాల్లోనూ తమ సత్తా చాటి ముఖ్యమంత్రిగా సేవలందించారు. చిరంజీవి వంటి లెజెండరీ యాక్టర్ కూడా రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా…రెండు రంగాల్లోని ఎత్తుపల్లాలు చవి చూశారు. అయితే, ఈ నటీనటులుగాని, వారి వారసులుగానీ వైరి పార్టీల నుంచి కక్ష సాధింపులకు గురికాలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలోనూ పవన్, చరణ్ ల సినిమాలపై నాటి అధికార పార్టీలు కక్ష సాధించలేదు.
కానీ, సీఎం జగన్ హయాంలో మాత్రం ఈ రకమైన కక్ష సాధింపు ధోరణి మొదలైంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడే మొదలైంది. కేవలం పవన్ ను టార్గెట్ చేయడం కోసమే…ఏపీలో జగన్ ప్రభుత్వం…టికెట్ల రేట్లు, థియేటర్లలలో వసతులు అంటూ గత ప్రభుత్వాలు వేలు పెట్టని విషయాల్లో లోతుగా వేళ్లు, ,కాళ్లు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సమయంలో జగన్ మొదలుబెట్టిన ఈ ట్రెండ్ ను భీమ్లా నాయక్ కూ కొనసాగించారు.
అనూహ్యంగా ఏమీ జరగలేదు..అనుకున్నట్లుగానే భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సినిమాను టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధించిందంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా జగన్ తీవ్రంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు.
ఈ సినిమా విషయంలో జగన్ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందన్నారు. ఈ చిత్రం విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ‘భీమ్లా నాయక్’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానని లోకేష్ అన్నారు. ఒకదాని తర్వాత మరొక పరిశ్రమను జగన్ ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు. అన్ని కుట్రలను అధిగమించి ఈ చిత్రం విజయం సాధించాలని కోరారు.