శ్రీకాకుళం రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎర్రన్నకు ఎంతో పేరు ఉంది. కనీసం రోడ్డు సౌకర్యం లేని గ్రామాలను సైతం ఆయన సైకిల్ పై చుట్టివచ్చారు.తొలి రోజుల్లో ఆయన వెంట అతి కొద్ది మంది యువకులు మాత్రమే ఉండేవారు. ఆ రోజుల్లో ఇన్ని ప్రసార మాధ్యమాలు లేకపోవడంతో రాణించేందుకు ఎంతగానో శ్రమించారు.
మారుమూల ప్రాంతం అయిన నిమ్మాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకూ ఆయన ఎదిగారు. దేశ రాజకీయాల్లో రాణించారు. ముఖ్యంగా ఉత్తరాది పార్టీల నేతలతోనూ సఖ్యంగా మెలిగారు. కడదాకా సమైక్య వాదం వినిపించారు. ఢిల్లీకి చేరుకునే నాటికి ఇంగ్లీషు, హిందీ భాషలు రాకపోయినా, తన బిడ్డలతో సమానంగా నేర్చుకుని, తరువాత కాలంలో రాణించారు.
లాయర్ కావాలనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. న్యాయ శాస్త్రం అభ్యసించాక ఇటుగా రాజకీయాల్లోకి వచ్చారు. చదువుకునే రోజుల్లో విద్యార్థి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఆయన రాజకీయ గురువు గౌతు లచ్చన్న. ఓ సందర్భంలో ఎన్టీఆర్ ను సైతం ఎదిరించి నిలిచిన ధీరోదాత్తత ఆయన సొంతం. చంద్రబాబు దగ్గర సైతం ఆయన మాటకు ఎదురేలేదు.
ఇక వ్యక్తిత్వ రీత్యా నాయుడు గారు ఏం చెప్పినా వినేవారు. ఎవ్వరు సాయం అని వచ్చినా చేసి పంపేవారు. ప్రపంచ నలుమూలల్లో వివిధ కారణాల రీత్యా ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన తెలుగు వారిని స్వదేశానికి రప్పించి, స్వస్థలాలకు చేర్చేవారు. అన్న మాట ఒకటి చివరి దాకా స్థిరం చేసి వెళ్లారు. అనూహ్య రీతిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
కొడుకు ఎంట్రీ .. రాజకీయం మారింది !
కొడుకు కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేశారు. ఆరంభంలో ఎన్నో కష్టాలు ఓర్చి తరువాత కాలంలో తిరుగులేని నేత అయ్యారు . దిగ్గజ నేతలను ఢీ కొంటున్నారు. మోడీ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.కే సీఆర్ కుటుంబం నుంచి మంచి మన్ననలు అందుకుంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి! ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి?
ఎప్పటి నుంచో ఢిల్లీ రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నారు. తనకింకా వయస్సు ఉందని, కనుక ప్రాంతీయ రాజకీయాల్లో ముఖ్య రాష్ట్ర రాజకీయాల్లో నేతగా ఎదిగేందుకే ఎక్కువగా ఆసక్తి ఉందని కొన్ని సార్లు చెప్పారాయన. వ్యక్తిగత సంభాషణల్లో చెప్పిన మాటలు ఇవి.
ఇదే నేపథ్యంలో ఆయన నరసన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు ఉన్న అవకాశాలనూ కొట్టిపారేయలేం. అదేవిధంగా తన సంస్థ భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున కొన్ని మంచి కార్యక్రమాలు ఇదివరకే చేపట్టారు. వాటిని విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ఇదే సంస్థ ద్వారా ఒక మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కూడా కొందరు ప్రతిపాదించారు. ఇందుకు ఒప్పుకున్నారు కానీ సంబంధిత కార్యాచరణ అయితే ఎంపీ రాము తరఫున లేదు అన్నది ఓ వాస్తవం.
ఈ కాస్త నిర్లక్ష్యం కూడా ఎందుకు?
లాన్స్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు (గల్వన్ లోయల్లో విస్ఫోటన పదార్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగాప్రమాదవశాత్తూ మరణించారు) విగ్రహం ఏర్పాటు చేస్తాను అని అన్నారు. అది పెండింగ్.
తండ్రి ఎర్రన్న పేరిట ఒక స్మారక వనం ఏర్పాటు చేస్తాం అని భావించారు కానీ అది కూడా ముందుకు పోలేదు.
సామాజిక బాధ్యతలో భాగంగా ఎర్రన్న స్మారక కళా మందిరం ఒకటి నిర్మించాలని ఎందరో ఆయనను కోరుతున్నారు. ఆ విధంగా నిర్మిస్తే సాంస్కృతిక, కళా రంగాలకు వీలున్నంత మేర చేయూత దక్కుతుందని కూడా వివరిస్తున్నారు. కానీ ఇందుకు కూడా ఎర్రన్న కుటుంబం ముందడుగు వేయడం లేదు. ఇది కూడా పెండింగ్.
రామ్మోహన్ నాయుడు విషయానికొస్తే… మంచి వక్త అనిపించుకుంటున్నాడు కానీ పనిమంతుడు అనిపించుకోలేకపోతున్నాడు. దీనికి అసెంబ్లీ నుంచి ఎన్నికవలేదు కదా అన్న సమాధానం ఆయన గొంతులో ఉండొచ్చు. బట్… అది సరికాదు. ఆకర్షణీయమైన నేతగా ఎదిగాడు కానీ సొంత వర్గాన్ని నిర్మించుకోలేకపోయాడన్న సద్విమర్శ ఉంది. సొంత వర్గం, ప్రాక్టికల్ పనితనం… ఫ్యూచర్ లీడర్ కావడానికి చాలా అవసరం.
ఇంకా రాము చేయాల్సిందేంటి?
చంద్రబాబు హయాంలో ఎర్రన్న జయంతిని, వర్థంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక కార్యక్రమాలుగా ఖరారు చేస్తూ, సంబంధిత నిధులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు అవేవీ లేకపోయినా కుటుంబం ఆయనకు నివాళి ఇస్తుంది కానీ ఆయన తరఫున చేయాల్సినంత రీతిలో సేవా కార్యక్రమాలు చేయడం లేదు అన్నది ఓ విమర్శ. కరోనా సమయంలో కొంతవరకూ ఎంపీ రామూ తన స్నేహితుల సాయం తీసుకుని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా ఆయన స్థాయిలో చేయాల్సిందెంతో!
సామాజిక హిత కార్యక్రమాలకు ఎంపీ రామూ మరింత ప్రాధాన్యం ఇస్తే, రాజకీయ ఎదుగుదల కూడా ఇంకాస్త పరిణితికి నోచుకుని ఉంటుందన్నది ఇవాళ జిల్లా వాసుల అభిప్రాయం.ఆ విధంగా అడుగులు వేస్తే మేలు. జగన్ తరఫున అన్నా క్యాంటీన్లు రద్దయ్యా యి సరే, అదే సమయంలో ఓ నిత్యాన్న దాన కేంద్రాన్ని ఎర్రన్న తరఫున ఏర్పాటు చేస్తే ఎంతో బాగుండేది అన్న భావన కూడా వచ్చింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియం సమీపాన ఆయన ఎంతో అపురూపంగా నిర్మించుకున్న ప్రజా సదన్ ను ఇవాళ ఓ ప్రయివేటు పాఠశాల నిర్వహణకు ఇచ్చేశారు. నాన్న ఎర్రన్న నిర్మించిన ప్రజాసదన్ ను ఓ స్మారక గ్రంథాలయం ఏర్పాటుకు ఇచ్చినా బాగుండేది అన్న ప్రతిపాదన కూడా వచ్చింది.
వాట్ ఎవర్ ఇట్ మే బీ, హూ ఎవర్ ఇట్ మే బీ వ్యక్తి ఉన్నతి సామాజిక ఉన్నతికి కారణం అయితేనే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అందుకు ఎంపీ రామూ చేయాల్సిందెంతో! అప్పుడే ఆయన రాజకీయ భవిష్యత్ కూడా బాగుంటుంది.
ఎంపీ ల్యాడ్ కోటాలో వచ్చే నిధుల వెచ్చింపు కూడా బాగానే ఉన్నా ఇంకా ఆయన కేంద్రాన్ని ఒప్పించి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించేలా చేయవచ్చు.అందుకు తగ్గ మార్గాలన్నీ రామూకు చేరువలోనే ఉన్నాయి.ఈ దిశగా కూడా ఆయన ఆలోచించి సమున్నత రీతిలో జిల్లా ప్రగతికి కింజరాపు కుటుంబం పాటుపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.