ఏపీలో హింస ఆగడం లేదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలం అవుతున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సజీవ దహనాలు, హత్యలు చాలా కామన్ అయిపోయాయి. పోలీసులు ఏం చేయగలరు అన్న తెగింపో లేకపోతే ఇంతవరకు ఏం చేసినా పోలీసులు నిందితులను ఏమీ చేయడం లేదు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారో గాని అనూహ్య నేరాలు జరుగుతున్నాయి.
ఈరోజు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. అతను కడప జిల్లా కీలక నేత. పట్టపగలు గొడ్డలితో తలపై నరికిచంపారు. చాలాకాలం క్రితమే అంతరించింది అనుకుంటున్న ఫ్యాక్షనిజం మళ్లీ తెరపైకి రావడానికి పోలీసుల అలసత్వమే కారణం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
హత్యకు కొన్ని గంటల క్రితమే చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, పోలీసులు చోద్యంచూస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ కి, డీజీపీ గౌతం సవాంగ్ కి లేఖ రాశారు. అంతలోనే ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేసిన సుబ్బయ్యను దారుణంగా చంపారు. దీనిపసై చంద్రబాబు ఘాటుగా రెస్పాండ్ అయ్యారు.
ఇది చంద్రబాబు స్పందన –
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ తాడిపత్రి ఘటనపై ముఖ్యమంత్రికి, డిజిపికి లేఖలు రాసి 24 గంటలు దాటకుండానే చేనేత కుటుంబానికి చెందిన నాయకుడు సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేసారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమా? ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు, మానభంగాలు, హింసా విధ్వంసాలతో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది చేస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడినందుకు సుబ్బయ్యను హత్య చేస్తారా? రాష్ట్రాన్ని రౌడీలు, హంతకుల చేతిలో పెట్టి పోలీసులు చేతులు ముడుచుకు కూర్చున్నారా? పోలీసులు వెంటనే ఈ హత్యలో వైసీపీ నేతల పాత్రపై ఆరా తీసి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి.
ప్రతిపక్షంగా జగన్ గతంలో చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు. కానీ ఎన్నడూ ఇలాంటి నేరాలు జరగలేదు. నేడు ఎవరైనా విమర్శలు చేస్తే బెదిరింపులు, తిట్లు, బూతులు, హత్యలు జరిగే పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు హత్యలు చేస్తే ఎవరూ నోరు విప్పకుండా ఉంటారని అనుకుంటున్నారేమో … అలా చేస్తే ప్రజలు కూడా మీ అంతు చూస్తారు అంటూ తెలుగుదేశం నేత అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు .