రాజకీయాల్లో వారసత్వం మామూలే. ఏ నాయకుడైనా తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలనే చూడడం పరిపాటిగా మారిపోయింది.
అలా రాజకీయాల్లో అడుగుపెట్టిన పిల్లలు ఎన్నికల్లో గెలిచి తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టడం చూస్తూనే ఉన్నాం.
కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఓ ఆశ్చర్యకర అంశం తెరమీదకు వచ్చింది.
తండ్రులను ఓడించిన వాళ్లపై విజయంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వాళ్ల కూతుళ్లు ఎన్నికల బరిలో దిగుతున్నారు. తమ తండ్రులను ఓడించిన ప్రత్యర్థులపైనే పోరుకు సిద్ధమయ్యారు.
ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఒకప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావడం విశేషం. వాళ్లే రీతూ ఖండూరీ భూషణ్, అనుపమా రావత్.
ఉత్తరాఖండ్ మాజీ సీఎం మేజర్ జనరల్ భువన చంద్ర ఖండూరీ తనయనే రీతూ ఖండూరీ భూషణ్.
2012 ఎన్నికల్లో కోటద్వార్‌లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ నేగి చేతిలో భువన చంద్ర ఓడిపోయారు.
ఇప్పుడదే నియోజకవర్గంలో గతంలో తన తండ్రిని ఓడించిన సురేంద్ర సింగ్‌పై పోటీకి రీతూ సిద్ధమయ్యారు.
తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
మరో అనుపమా రావత్ ఎవరో కాదు.. మరో మాజీ సీఎం హరీశ్ రావత్ కుమార్తె.
ఆమె కూడా తన తండ్రిని ఓడించిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు.
2017 ఎన్నికల్లో హరిద్వార్ రూరల్‌లో బీజేపీ అభ్యర్థి స్వామి యతీశ్వరానంద్ చేతిలో హరీశ్ రావత్ పరాజయం పాలయ్యారు.
ఇప్పుడదే నియోజకవర్గం నుంచి అనుపమా రావత్ పోటీ చేస్తున్నారు.
స్వామి యతీశ్వరానంద్పై విజయమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు.
మరి ఈ ఇద్దరు అమ్మాయిలు.. తమ ప్రత్యర్థులపై నెగ్గి ప్రతీకారం తీర్చుకుంటారా? అన్నది ఫిబ్రవరి 14న తేలిపోతుంది.